‘ఎమ్మెస్కో’కు లోక్‌నాయక్‌ పురస్కారం

Loknayak Award For EMESCO Organization - Sakshi

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తెలుగుభాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమెస్కో సంస్థకు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు అందజేయనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ చెప్పారు. విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 జనవరి 18న విశాఖలోని వుడా బాలల థియేటర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమెస్కో ప్రధాన కార్యనిర్వాహకుడు డి.విజయ కుమార్‌కు ఈ పురస్కారం కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేస్తామన్నారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం కింద రూ.లక్ష నగదు అందజేస్తామని వివరించారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ద్వారా అందజేసే పురస్కార మొత్తాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు.

జీఓ–81తో ప్రయోజనమే..
ప్రభుత్వం విడుదల చేసిన జీఓ–81తో పలు ప్రయోజనాలు ఉన్నాయని యార్లగడ్డ చెప్పారు. ఈ జీవో వల్ల సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఓక్‌రిడ్జ్‌ పాఠశాలల్లో సైతం తెలుగుభాషకు స్థానం లభిస్తుందన్నారు. పాదయాత్రలో కలిసిన ప్రజల అభ్యర్థన మేరకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడుతున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో ఫౌండేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ బాబయ్య పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top