రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ ఇటు టీడీపీ నేతలు, అటు డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది.
కౌంట్‌డౌన్
నేతలు, అధికారులకు తలనొప్పిగా మారిన భూసమీకరణ
{పభుత్వంపై నమ్మకం లేకనే నత్తనడక
తాడికొండ: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ ఇటు టీడీపీ నేతలు, అటు డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. సీఎం చంద్రబాబు భూసమీకరణను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించారు. మంత్రి పి. నారాయణను రాజధాని ప్రాంతంలోనే ఉండి సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ నత్తనడక నడుస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇప్పటివరకు 17,004 ఎకరాలకు మాత్రమే రైతులు అంగీకార పత్రాలు అందించారు. ఈ నెల 14 తేదీతో భూసమీకరణ తేది గడువు ముగియనుంది. ప్రభుత్వ లక్ష్యం తొలివిడత 30 వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంది. మరో ఐదు రోజుల్లో మిగతా 13 వేల ఎకరాలు సమీకరించటం సాధ్యమేనా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు 40 రోజుల్లో రోజుకు సగటున 400 నుంచి 500 ఎకరాలు మాత్రమే సమీకరించారు. ఐదురోజుల్లో 13 వేల ఎకరాలంటే రోజుకు కనీసం 2,600 ఎకరాలు సమీకరించాల్సిఉంది.ఇది ఎంత వరకు సాధ్యమో వేచి చూడాల్సిందే.
ప్రభుత్వంపై నమ్మకం లేకనే... భూసమీకరణ నత్తనడకకు ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవటమేనని రైతులు అంటున్నారు. ఇప్పటికి గ్రామాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులే భూ అంగీకార పత్రాలను సమర్పించ లేదు. అధిక గ్రామాల్లో ఇప్పటివరకు 40 శాతం కూడా సమీకరణ పూర్తి కాలేదు. రాయపూడి, వెంకటపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి తదితర గ్రామాల్లో భూసమీకరణకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రైతులను ఒప్పించే భాధ్యత అప్పగించినా ఫలితం శూన్యంగా మారింది.
భూ సమీకరణపై స్పస్టమైన విధివిధానాలు, సీఆర్‌డీఏ కార్యాలయంలో అందుబాటులోలేని భూ వివరాలు, రైతుల సందేహాలు నివృత్తి చేయలేకపోవటం వంటి కారణాలతో సమీకరణ మందగించింది. ప్రధానంగా చంద్రబాబు సీఎంగా రైతు రుణమాఫీలో విఫలంకావడంతో ఆయనను నమ్మలేక రైతులు సమీకరణకు భూములు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు ఏదిఏమైనా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులకు భూ సమీకరణ ఓ సవాల్‌గా మారింది.