ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని, ఓట్లు...సీట్లకోసం రాష్ట్ర విభజన చేయరాదంటూ ఉద్యమిస్తున్న సమైక్యవాదుల మనోస్థైర్యం పెరిగింది. చిత్తశుద్ధితో పోరాటం చేయగల నాయకుడు లేరనే లోటు తీరింది.
సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని, ఓట్లు...సీట్లకోసం రాష్ట్ర విభజన చేయరాదంటూ ఉద్యమిస్తున్న సమైక్యవాదుల మనోస్థైర్యం పెరిగింది. చిత్తశుద్ధితో పోరాటం చేయగల నాయకుడు లేరనే లోటు తీరింది. ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నా సమర్థవంతంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకున్నామనే భావన తొలగిపోనుంది. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్దిని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకోగలరనే భరోసాను ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఉద్యమం ఎగిసిపడుతోంది. 57రోజులుగా అలుపెరగని పోరాటాన్ని సమైక్యవాదులు చేస్తున్నారు.
ఎంతటి కష్టనష్టాన్ని భరించేందుకైనా వెనుకంజ వేయడంలేదు. జీతం కంటే జీవితం ముఖ్యమని ఉద్యమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలవాల్సిన రాజకీయపార్టీలు ఓట్ల కోసం డొంకతిరుగుడు వ్యవహారాలు నడుపుతున్నారు. పదవుల్లో ఉంటే ప్రాంతం కోసం ఉద్యమించేందుకు వీలుంటుందని, అందుకోసమే కొనసాగుతున్నామని ఉచిత సలహాలిస్తున్నారు. ప్రాంతం కంటే రాజకీయాలే మిన్నగా భావిస్తూ కాలం నెట్టుకొస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల తీరును సమైక్యవాదులు నిరసిస్తున్నారు.
రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర విభజన ఏర్పడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు ఎడారిగా మారుతాయని, అందరికీ అనువైన హైదరాబాద్ ఒక ప్రాంతానికే పరిమితం అవుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
జైల్లో ఉంటూ ఆమరణదీక్షను సైతం చేపట్టారు. ఈపరిస్థితుల్లో బెయిల్‌పై ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కావడాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు. ఈ మేరకు సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం కలిసి ఉద్యమం ఉధృతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.
రాజకీయ సంక్షోభంపైనే దృష్టి....
రాష్ర్ట విభజనలో ప్రధాన భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉద్యమకారుల నుంచి ఇప్పటికే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మంత్రులు రామచంద్రయ్య, అహ్మదుల్లా, 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసీరెడ్డిలపై సమైక్యవాదులు తీవ్ర స్థాయిలో విరుచుకుబడ్డారు. ఎమ్మెల్యే కమలమ్మ, ఎమ్మెల్సీ బత్యాలకు సైతం సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన తప్పలేదు. ఉద్యమం బలపడే కొద్ది కాంగ్రెస్ నేతలపై సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రులు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ రాజీనామా చేయాలని తద్వారా రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై కూడా ఉద్యమకారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్సార్‌సీపీలాగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాలని కోరుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడంతోనే విభజన ప్రకటన ఉత్పన్నమైందని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ పార్టీ అయితే, మలిముద్దాయి తెలుగుదేశం పార్టీనే అని పేర్కొంటున్నారు.
జగన్ విడుదలతో మనోస్థైర్యం....
రాష్ట్ర విభజన అనివార్యం కానుందని, సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ అధిష్టానాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సమైక్యవాదులు మదనపడుతున్నారు. సమైక్యరాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఒక్కమారుగా సమైక్యవాదుల్లో మనోస్థైర్యం పెరిగింది.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రత్యక్షంగా పోరాటం చేయగలిగిన, ప్రజాదరణ కల్గిన బలమైన నాయకుడు ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. బలమైన నాయకత్వం లేని కారణంగానే, రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైందని సమైక్యవాదులు విశ్వసిస్తున్నారు. ఈనేపధ్యంలో ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కావడాన్ని సమైక్యవాదులు హర్షిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం తనను కలిసేందుకు వచ్చారని తెలుసుకుని ముందుగా వారిని జగన్ ఆహ్వానించడాన్ని ఈసందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.