ఓటరు నమోదుకు... ఆఖరి అవకాశం! | Last Date For Voter Registration In Srikakulam | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు... ఆఖరి అవకాశం!

Sep 7 2018 1:20 PM | Updated on Sep 7 2018 1:20 PM

Last Date For Voter Registration In Srikakulam - Sakshi

గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ ధనంజయరెడ్డి తదితరులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరి ఓటు వేయాలంటే ఓటుహక్కు పొందాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఈ ఓటుహక్కు కావాలంటే ఓటరుగా నమోదుకావడం ఒక్కటే మార్గం. ఇందుకు వచ్చే నెల 31వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే రానున్న అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం చేజార్చుకున్నట్లే! ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జరిగిన ఓటర్ల నమోదు సమ్మరీల్లో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. దీనివెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన వారంతా తమ ఓటుహక్కు పరిరక్షించుకోవడం కోసం ఈ సమ్మరీని సద్వినియోగం చేసుకోవాల్సిందే.

ఎన్నికల కమిషన్‌ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత కీలకంగా మారింది. అకారణంగా ఓటు గల్లంతైనవారు మరోసారి తమ పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 2019 జనవరి 31వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండేవారంతా ఓటుహక్కు పొందవచ్చు. ఈ ఓటర్ల నమోదు సమ్మరీ ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. 2019 జనవరి 4వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటనతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ప్రస్తుత శాసనసభకు జూన్‌ వరకూ గడువు ఉన్నప్పటికీ ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఈ ఓటర్ల జాబితానే దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది.

అభ్యంతరాలపై విచారణ తప్పనిసరి...
ఓటర్ల తొలగింపులపై ఇప్పటివరకూ ఎలాంటి అభ్యంతరాలొచ్చినా క్షేత్ర స్థాయిలో అధికారుల విచారణ మొక్కుబడిగా జరుగుతోంది. దీనివల్ల అర్హులైనవారు తమ ఓటుహక్కును కోల్పోతున్నారు. ప్రతిపక్షాల సానుభూతిపరులు, నాయకుల ఓట్లను గల్లంతు చేసేందుకు అధికార పార్టీ నాయకులు కూడా ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్యంగా శ్రీకాకుళం, రాజాం, పలాస, ఆమదాలవలస పట్టణాల్లోలో వేలాది ఓట్లు తొలగింపు జరిగిపోయింది. ఇంటింటా సర్వేలు పెట్టి సుమారుగా 36 వేల ఓట్లను తొలగించారు. వాటిని ఇప్పటికీ అధికారులు భర్తీ చేయలేదు. అడ్డగోలుగా ఓట్ల తొలగింపుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పలు సమావేశాల్లో అధికారులను నిలదీసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు, అధికార పార్టీ ఆగడాలు లేకుండా సమ్మరీ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులు, చేర్పులు వంటి వాటిపైనా, అభ్యంతరాల విచారణపైనా నిఘా ఉంచనుంది. అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.

అందరి భాగస్వామ్యం తప్పనిసరి...
అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదుకావడానికి స్వయంశక్తి సంఘాలు, స్వచ్చంద సంస్థలు, ఇతర పౌర సమాజంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఈసారి ఎన్నికల కమిషన్‌ అధికార్లను ఆదేశించింది. ఫారం–6, 6ఏ, 7, 8, 8ఏలతో వచ్చే క్లైంలను, అభ్యంతరాలను వెంటనే అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఆ జాబితాలో కనీసం 2 శాతాన్ని జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేయాలని, ఒక శాతం జిల్లా కలెక్టరు, అలాగే అర శాతం ఓట్లను రోల్‌ అబ్జర్వరు విచారణ చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ రాష్ట్ర అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ దశలో, అలాగే అభ్యంతరాల పరిష్కార దశలో, తుది జాబితాను ప్రకటన సమయంలో ఆయన జిల్లాలో పర్యటించి పరిశీలించాల్సి ఉంది. రోల్‌ అబ్జర్వర్‌ జిల్లా పర్యటన సమయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు ఉంటే పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 2,908 పోలింగ్‌  కేంద్రాలు
జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల సవరణ అనంతరం 2,908 కేంద్రాలు ఉన్నాయి. గతంలో 2,686 ఉండేవి. ఈ ప్రకారం 231 కొత్త పోలింగ్‌ కేంద్రాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఉన్న వంశధార నిర్వాసిత గ్రామాల్లోని తొమ్మిది కేంద్రాలను తొలగించారు. అలాగే 98 పోలింగ్‌ కేంద్రాల ప్రాంతం మార్చారు. 118 కేంద్రాల పేర్లు మారాయి.

జిల్లాలో ప్రక్రియపై వీసీ...
జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల సమ్మరీపై గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి, జాయింట్‌ కలెక్టరు కేవీఎన్‌  చక్రధరబాబు, డిఆర్‌వో కె.నరేంద్రకుమార్‌ తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రక్రియ ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సహాయం తీసుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు బూత్‌ స్థాయి అధికారులను నియమించాలని చెప్పారు. ఓటర్ల సవరణ జాబితాపై  మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలకు ఎప్పటికప్పుడు తగు సమాచారం అందించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement