నకిలీలను అరికడతాం: మంత్రి కన్నబాబు

kurasala Kannababu Review With Agriculture Officers In West Godavari - Sakshi

సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : నకిలీ ఎరువులు, పురుగుమందులు, విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. బుధవారం నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాసంలో జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులతో అంతర్గతంగా ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇక నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల కంపె నీలు ప్రభుత్వంతో కచ్చితంగా ఎంవోయూ చేయించుకోవాలన్నారు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. నకిలీల బెడద తగ్గుతుందన్నారు. ఈ కీలక నిర్ణయంతో నకిలీ  వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. ఇది రైతు ప్రభుత్వమన్నారు. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ రైతు సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని 15 శాతం పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

నియోజకవర్గానికో అగ్రికల్చర్‌ ల్యాబ్‌
ప్రతి నియోజకవర్గానికీ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు చెప్పారు. 119 ల్యాబ్‌లను మంజూరు చేస్తామన్నారు.  కృషి విజ్ఞాన కేంద్రం, యూనివర్సిటీల్లో ప్రస్తుతం 40 వరకూ ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయన్నారు. కొత్త ల్యాబ్స్‌ ఏర్పాటుతో దాదాపు 160 వరకూ పెరుగుతాయన్నారు. మట్టి నమునా పరీక్షలు నుంచి అన్ని రకాల పరీక్షలు రైతులకు దగ్గరలో నియోజకవర్గ కేంద్రంలో ఉండే ల్యాబ్‌తో అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యవసాయశాఖ అధికారుల సమీక్షలో మంత్రి రైతు భరోసా పథకంపై చర్చించారు. పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని, పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కౌలు రైతుల గుర్తింపులో ఎలాంటి లోపాలు జరగకుండా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో  అగ్రికల్చర్‌ జేడీ గౌసియాబేగం, నరసాపురం, భీమవరం ఏడీఏలు కె.శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు, ఏవోలు నారాయణరావు, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top