ఇసుక మాఫియాపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

Published Tue, Aug 26 2014 1:25 AM

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం - Sakshi

  •    ర్యాంపులపై అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక దాడులు
  •     మూడు లారీల పట్టివేత
  •     నిఘా పెంచాలని ఆదేశం
  • చోడవరం : జిల్లాలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కన్నెర్ర చేశారు. నేరుగా ఆయనే ఆకస్మిక దాడులు చేసి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించారు. దీంతో ఇసుక అక్రమ రవాణాపై ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చినట్లైంది. చోడవరం నియోజకవర్గ పరిధి శారద, పెద్దేరు, బొడ్డేరు నదీ పరీవాహక ప్రాంతాల్లోని గోవాడ, గజపతినగరం, గౌరీపట్నం, మార్టమ్మరేవు, లక్ష్మీపురం కల్లాల పరిధిలోని ఇసుక ర్యాంపులపై ఆదివారం అర్ధరాత్రి దాడులు చేశారు.

    ఇసుక లోడుకు సిద్ధంగా ఉన్న మూడు లారీలను, పలువురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా మరింత పెంచాలని, రాత్రి సమయాల్లో గస్తీ విస్తృతం చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. కనిపించిన ఇసుక లారీలన్నింటినీ సీజ్ చేస్తున్నారు. ఎస్పీయే నేరుగా రంగంలోకి దిగడంతో కిందస్థాయి పోలీసు అధికారులు ఉరుకు పరుగులు తీశారు.
     
    మాఫియా గుండెల్లో గుబులు
     
    అధికారుల నిర్లక్ష్యం పుణ్యమాని ఇన్నాళ్లూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ, అక్రమంగా నదులు, గెడ్డల్లో ఇసుకను తరలించుకుపోతూ ప్రభుత్వానికి ఒక్కపైసా కూడా ఆదాయం రానీయకుండా ఇసుక మాఫియా ఏటా రూ.కోట్లు ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల నదులు, గెడ్డలపై ఉన్న వంతెనలు, గ్రోయిన్లు, ఆనకట్టలు దెబ్బతింటున్నాయి. వీటిని సంరక్షించాల్సిన రెవెన్యూ, పోలీసు, భూగర్భ గనులు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖలు ఇసుమంతైనా పట్టించుకోవడంలేదు.

    అడపాదడపా నామమాత్రంగా కేసులు పెడుతుండడంతో అక్రమార్కులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇటీవల పలువురు రెవెన్యూ అధికారులపై మాఫియా పలు చోట్ల దాడులు కూడా చేయగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.  ఈ పరిస్థితుల్లో కొత్తగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కోయ ప్రవీణ్ ఇసుక మాఫియాపై  ఉక్కుపాదం మోపే చర్యలకు శ్రీకారం చుట్టారు.
     
    జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా చర్యలు మరింత పెంచాలని కిందస్థాయి పోలీసు అధికారులకు గత వారం రోజుల కిందటే ఆయన ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు  కొంత మెతక వైఖరి అవలంబించిన అధికారులు సైతం ఎస్పీ ఆదేశాలతో అలెర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీయే నేరుగా ఇసుక మాఫియా ఆగడాలపై దృష్టిసారించారు. ఎస్పీ ఈ తరహా దాడులు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇసుక మాఫియా పుణ్యమా అని పలు నదుల్లో వంతెనలు, గ్రోయిన్లు కూలిపోయిన దృష్ట్యా ఈ తరహా దాడులు ఎంతైనా అవసరమని ప్రజలు అంటున్నారు.

Advertisement
Advertisement