ఇప్పటికే విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుమారు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేకులు వేసింది.
500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేక్
వేసవిలో వురింత కటకట
సెక్షన్ 11 ప్రయోగించి సరఫరా నిలుపుదల
కేంద్ర నిర్ణయూనికి వ్యతిరేకంగా చర్య
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సుమారు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు బ్రేకులు వేసింది. దీంతో వేసవిలో వురింత కటకట తప్పని దుస్థితి రానుంది. జాతీయ విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 11ను ప్రయోగించి.. కర్ణాటకలోని వివిధ విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా కాకుండా నిలుపుదల చేసింది. తమ రాష్ర్టంలో విద్యుత్ కొరతను తగ్గించుకోవడానికే కర్ణాటక ప్రభుత్వం ఈ చర్యకు దిగినట్టు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని జేఎస్‌డబ్ల్యు, శాలివాహన తదితర సంస్థల నుంచి సుమారు 500మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం గత ఏడాది ఫిబ్రవరిలోనే టెండర్లు పిలిచారు. 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. మార్చి వరకు కర్ణాటకలోని విద్యుత్ సంస్థల నుంచి మన రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరిగింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం సరఫరాను నిలిపివేసింది. దీనిపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
సరికాదంటున్న కేంద్రం: ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను పూర్తిగా ఆ రాష్ట్రానికే ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను (ఐపీపీ) శాసించే అవకాశం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత ఏడాదిలో లేఖలు కూడా రాసింది. బయటి మార్కెట్లో విద్యుత్‌ను అమ్మకుండా ఐపీపీలను నియంత్రించడం సరికాదని పేర్కొంది.
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికే పరిమితమై ఆలోచిస్తే... దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితి దెబ్బతింటుందని ఈ లేఖలో అభిప్రాయపడింది. జాతీయ విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 11ను ప్రయోగించి బయటి మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించకుండా నియంత్రించడం సరికాదని పేర్కొంది. వాస్తవానికి సెక్షన్ 11 ప్రకారం కేవలం విద్యుత్‌ను ఉత్పత్తి చేయూలంటూ ఆదేశించే అధికారం మాత్రమే రాష్ట్రానికి ఉంటుంది. సొంత రాష్ట్రానికే విద్యుత్‌ను సరఫరా చేయాలని నిబంధన విధించే అధికారం లేదు.