టీడీపీలో హైడ్రామా

Kapu TDP Leaders Secret Meeting In Kakinada, East Godavari - Sakshi

‘దేశం’లో సంక్షోభ ప్రకంపనలు

చర్చనీయాంశమైన కాకినాడ సమావేశం

సాక్షి, కాకినాడ (తూర్పు గోదావరి): టీడీపీలో హైడ్రామాకూ ‘తూర్పు’ వేదిక కానుందా? ఆ పార్టీలో సంక్షోభానికి ఇక్కడినుంచే మార్పులు చోటుచేసుకోనున్నాయా? సంక్షోభం పేరుతో కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధానిలో టీడీపీ రాజ్యసభ సభ్యులు యుద్ధ ప్రాతిపదికన బీజేపీలో చేరగా, అదే సమయంలో టీడీపీకి చెందిన కాపు సామాజికవర్గ మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అధినేత డైరెక్షన్‌లో కొందరు నడుచుకోగా, మన దారి మనం చూసుకోవాలన్న ధోరణితో మరికొందరు నాటకీయంగా అడుగులు వేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయింది. కింకర్తవ్యమంటూ భవిష్యత్తుపై దృష్టి సారించారు. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం అర్రులు చాస్తున్నట్టుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహిత నేతలుగా, బినామీలుగా చెప్పుకునే కొందరు కీలక నేతలు బీజేపీలో చేరడం వెనుక ఇదే ఉద్దేశమని భావిస్తున్నారు. చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరిగిందా? లేదంటే ఆయన డైరెక్షన్‌లోనే వారంతా పార్టీ మారారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  గతంలో తెలంగాణలో రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి...తరువాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కాకినాడలోని సిటీ ఇన్‌ హోటల్‌లో టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలు 13 మంది ప్రత్యేకంగా భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు కూడా రాజ్యసభ సభ్యుల బాటలో బీజేపీలోకి వెళ్లేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంతా చర్చించుకున్నారు. కానీ,వీరి సమావేశం వెనక మరో కారణం ఉందని వాదన వినిపిస్తోంది. తనకు సన్నిహితులైన వారిని బీజేపీలోకి చంద్రబాబే పంపించారని, వారిని వెళ్లిపోమని చెప్పిన చంద్రబాబు తమకెందుకు చెప్పలేదనే కారణంతో వీరంతా ప్రత్యేకంగా సమావేశమైనట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

కేసుల నుంచి కాపాడుకునేందుకు సన్నిహితులను పంపించిన చంద్రబాబును నమ్ముకుంటే తమ పుట్టి మునిగేలా ఉందని, మనమంతా కలిసికట్టుగా ఉండి, భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంతో కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలందరూ సమావేశమైనట్టు స్పష్టమవుతోంది. సుమారు 3 గంటలపాటు సమాలోచనలు చేసిన సదరు కాపు టీడీపీ నేతలు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సరికాదని, పరిస్థితులను అంచనా వేసుకుని గట్టి నిర్ణయం తీసుకుందామనే యోచనకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ భేటీ అయిన వారిలో కొందరిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. కోర్టులో ఏదో ఒక సందర్భంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టి, మనమంతా ఒక్కటనే ధోరణితో ముందుకెళితే కొంతమేర బయటపడొచ్చనే అభిప్రాయంతో సదరు నేతలు ఈ సమావేశాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే వీరు కూడా ఓ దారి చూసుకునే పనిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, పంచకర్ల రమేష్‌బాబు, ఈలి నాని, చెంగలరాయుడు, బండారు మాధవనాయుడు,  కదిరి బాబూరావు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top