మద్యపాన నియంత్రణలో ప్రభుత్వం భేష్‌

Justice Eshwaraiah Comments On AP Govt About Alcohol Regulation - Sakshi

ఆంగ్ల మాధ్యమ బోధనపై అవాస్తవ ప్రచారాలు తగదు

రాష్ట్ర ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య   

గుంటూరు ఎడ్యుకేషన్‌:  కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యపానాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భేష్‌ అని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య తెలిపారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. మద్యపాన నియంత్రణకు సీఎం వైఎస్‌ జగన్‌ మహత్తరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. వ్యాపారమయంగా మారిన పాఠశాల విద్యను ప్రక్షాళన చేసేందుకు రెగ్యులేటరీ కమిషన్‌తో పాటు తన అధ్యక్షతన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వేశారని చెప్పారు.  

లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లో అతి ముఖ్యమైన మద్యపాన నియంత్రణపైనే మిగిలిన అన్ని పథకాల అమలు ఆధారపడి ఉందని అన్నారు. తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తీసుకువచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు.

రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మద్యానికి బానిసలుగా మారడంతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న పరిస్థితులను చూసిన సీఎం మద్యపాన నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో అలహాబాద్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి లక్ష్మణరావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top