పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది | JC complaints of the victims in phone in programe | Sakshi
Sakshi News home page

పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది

Published Sat, Aug 15 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది

♦ జేసీ ఫోన్‌ఇన్లో బాధితుల ఫిర్యాదులు
♦ మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ - జాయింట్ కలెక్టర్
 
 ఒంగోలు టౌన్ : జిల్లాలో జరుగుతున్న మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంపై మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు వంటివి పారదర్శకంగా అందించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈనెల 10నుండి ప్రారంభమైన మీ ఇంటికి మీ భూమికి సంబంధించి ఇప్పటివరకు 14090అర్జీలు వచ్చాయని, అందులో 7213అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. 826అర్జీలను తిరస్కరించినట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్‌కు సంబంధించి 93గ్రామాల్లో 2లక్షల 90వేల రికార్డులను నమోదు చేశామని, మరో 4లక్షల రికార్డులను నమోదు చేయాల్సి ఉందని వివరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ ఏడీ నరసింహారావు, డీ సెక్షన్ సూపరింటెండ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

 ఫిర్యాదుల పరంపర...
 పచ్చనోటిస్తేనే పాస్ బుక్కులు పాసవుతున్నాయని, అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ కోసం నాలుగు నెలల నుంచి దర్శి తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దర్శి మండలం ముండ్లమూరుకు చెందిన అంబవరపు వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ ఇప్పిస్తానంటూ వీఆర్‌ఓ ఆరువేల రూపాయలు తీసుకున్నా పని మాత్రం జరగలేదన్నారు. దీనికి జేసీ స్పందిస్తూ మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దర్శిలో ఉంటున్న తన అన్న తిరుపతిరెడ్డికి సర్వే నెం 3లో 2.70 ఎకరాల భూమి ఉందని, ఆయన ఇటీవల మరణించడంతో తన వదిన పేరున పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని తహసీల్ధార్‌ను కోరితే రూ.1500 డిమాండ్ చేశారని ప్రస్తావించగా వెంటనే తిరుపతిరెడ్డి భార్యకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని దర్శి తహసీల్ధార్‌ను ఆదేశించారు. ఇంకొల్లు తహసీల్ధార్ కార్యాలయంలో కరప్షన్ ఎక్కువైంది. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు. కరప్షన్‌ను అరికట్టాలని ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంకు చెందిన రామకోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు.

తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారని, న్యాయం చేయాలని కోమటిగుంట కృష్ణ అనే వ్యక్తి వేడుకోగా  వెంటనే సమస్యను పరిష్కరించాలని జేసీ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఏడాది నుంచీ తిప్పుకుంటున్నారని పొన్నలూరు మండలం వెలటూరు గ్రామానికి చెందిన కొండేటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. పొన్నలూరు తహసీల్ధార్ కల్యాణ్‌తో జేసీ ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. తన భూమి వివరాలను మీ సేవలో చూసుకుంటే ఒక్క సెంట్ కూడా తన పేరు లేకుండా ఆక్రమించేశారని అర్ధవీడు మండలం కాకర్లకు చెంధిన పెరికె లక్ష్మణబాబు వాపోయాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement