రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే.. | injustice to andhra pradesh in preparing of Railway Budget | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే..

Feb 12 2014 4:26 AM | Updated on Sep 2 2017 3:35 AM

అసలే అంతంత మాత్రం.. ఆపై నిర్లక్ష్యం.. ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు.. అసలు పూర్తవుతాయో? లేదో? తెలియదు.. రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల దుస్థితి ఇది.

రాష్ట్ర ఎంపీ రైల్వే సహాయ మంత్రిగా ఉన్నా ఫలితం శూన్యం
 సాక్షి, హైదరాబాద్: అసలే అంతంత మాత్రం.. ఆపై నిర్లక్ష్యం.. ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు.. అసలు పూర్తవుతాయో? లేదో? తెలియదు.. రాష్ట్రానికి మంజూరైన రైల్వే ప్రాజెక్టుల దుస్థితి ఇది. రైల్వే మంత్రులుగా ఉన్నవారు రాష్ట్రంపై చూపే నిర్లక్ష్యానికి తోడు.. మన ఎంపీలు, నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాటి రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మన రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను ప్రకటించినా.. మంత్రిగా ఉన్న కొద్దికాలం వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత రైల్వే బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే అయితే అసలు మన రాష్ట్రం వైపే చూడలేదు. ఇక మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాశరెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నా... ఫలితం శూన్యం.   చివరకు తన సొంత పట్టణం కర్నూలుకు మంజూరు చేయించుకున్న ‘కోచ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు’కు కూడా నిధులు విడుదల చేయించుకోలేకపోయారు. ఖర్గే మాత్రం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గిర్‌లో బడ్జెట్ కేటాయింపుతో కూడా సంబంధం లేకుండా రైల్వే కోచ్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్‌లో పేర్కొన్న రాష్ట్ర ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తే...
 
 పట్టాలెక్కని రైళ్లు.. ఐదు
 గత బడ్జెట్‌లో దక్షిణమధ్య రైల్వేకు 11 కొత్త రైళ్లు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికీ 5 రైళ్లు పట్టాలెక్కలేదు. కాచిగూడ-మంగళూరు ఎక్స్‌ప్రెస్ వయా డోన్, గుత్తి, రేణిగుంట; కాచిగూడ- యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్; చెన్నై -నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్; తిరుపతి - చెన్నై; సికింద్రాబాద్ - తాండూరు ప్యాసింజర్ సర్వీసులు మొదలే కాలేదు.
 
 సర్వేలు గోవిందా..
 కొత్త మార్గాలు, ఉన్నవాటిని డబ్లింగ్ చేసేందుకు పలు ప్రాజెక్టులకు సర్వేలు చేయాలని నిర్ణయించారు. నామమాత్రంగా నిధులు కేటాయించారు. కానీ, ఆ పనులేవీ మొదలు కాలేదు. మంచిర్యాల- ఆదిలాబాద్, సిద్దిపేట - అక్కంపేట, వాశిం- ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ - గుత్తి, సికింద్రాబాద్ - ఆదిలాబాద్, తిరుపతి - కాట్పాడి రైల్వేలైన్ల సర్వేలు కాగితాలకే పరిమితమయ్యాయి.
 
 నిధులు దక్కని ఆదర్శ స్టేషన్లు..
 పలాస, పార్వతీపురం, విశాఖపట్నం, ఆదోని, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్‌లను ఆదర్శ స్టేషన్‌లుగా అభివృద్ధి చేస్తామన్న రైల్వే శాఖ.. నిధులు మాత్రం రాల్చలేదు.
 
 కొత్త ప్రాజెక్టులు కలే..
 కంభం-ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం, మణుగూరు-రామగుండం, చిక్‌బళ్లాపూర్-పుట్టపర్తి, శ్రీనివాసపుర-మదనపల్లి తదితర కొత్త ప్రాజెక్టులను గత బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఒక్కోదానికి ప్రాథమికంగా రూ. 10 లక్షలు చొప్పున కేటాయించారు. కానీ, ఆ  నిధులకూ దిక్కులేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement