విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

Huge Road accident At Vizianagaram - Sakshi

     కాశీ యాత్ర ముగించుకుని వస్తుండంగా బస్సును ఢీకొట్టిన లారీ

     ముగ్గురు దుర్మరణం

భోగాపురం(నెల్లిమర్ల): కాశీ యాత్ర ముగించుకుని వస్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సును లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నుంచి ఈ నెల 2న 45 మంది ట్రావెల్స్‌ బస్సులో కాశీ యాత్రకు బయల్దేరారు. వారంతా యలమంచిలి, ఎస్‌.రాయవరం, జి.కోడూరు, మాకవరం, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం గ్రామాలకు చెందినవారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో వారంతా బుధవారం తెల్లవారుజామున పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద సముద్ర స్నానాలు చేసి, గోవిందపురం వద్ద ఆలయాలు దర్శించుకుని భోజనం ముగించుకుని బయల్దేరారు.

పోలిపల్లి వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి వస్తున్న లారీ అక్కడి కూడలి వద్ద యూ టర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. దీంతో యూ టర్న్‌ తీసుకుంటున్న లారీ ఎదురుగా వెళ్తున్న యాత్రికుల బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు పల్టీకొట్టి బోల్తాపడింది. ఘటనలో బస్సులో ఉన్న యలమంచిలికి చెందిన కర్ణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి (52) అక్కడికక్కడే మృతి చెందారు.

గ్రామస్తులు బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సీఐ రఘువీర్‌ విష్ణు, ఎస్‌ఐ తారకేశ్వరరావు సిబ్బంది సహా సంఘటనా స్థలానికి చేరుకుని హైవే సిబ్బంది సహకారంతో జేసీబీలతో బస్సు, లారీలో చిక్కుకున్న క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీశారు. గాయపడ్డ వారిలో 28 మందిని తగరపువలస సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి, 9 మందిని విశాఖ కేజీహెచ్‌కు, మరో ఏడుగురిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top