కష్టాల హాస్టళ్లు | hostels have lot of problems | Sakshi
Sakshi News home page

కష్టాల హాస్టళ్లు

Published Fri, Dec 13 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

hostels have lot of problems


 సంక్షేమ హాస్టళ్లు పిల్లలకు నరకాన్ని చూపిస్తున్నాయి. దుప్పట్లు లేక అనేకమంది చలికి గజగజ వణుకుతున్నారు. ప్రభుత్వం కొంతమందికి దుప్పట్లు అందించింది. అవి నాసిరకంగా ఉండడంతో చలిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇక టాయిలెట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రజా సమస్యలపై ‘సాక్షి’ సమరంలో భాగంగా హాస్టళ్లలోని సమస్యలను వెలుగులోకి తెచ్చే దిశగా ప్రత్యేక కథనం..                
 
 సాక్షి, చిత్తూరు:
 జిల్లాలో 126 ఎస్సీ, 16 ఎస్టీ, 66 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. అన్ని హాస్టళ్లలోనూ సమస్యలు కొలువుదీరాయి. చాలా హాస్టళ్లలో విద్యార్థులు చలికి, వర్షానికి సురక్షితంగా ఉండే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కిటికీలు విరిగిపోయాయి. మరికొన్ని హాస్టళ్లు రేకులషెడ్లలో నడుస్తున్నాయి. ఇవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సత్యవేడు వంటి చోట్ల హాస్టళ్లకు తలుపులు లేవు. ఆవులు వచ్చి పుస్తకాలు తినేసి వెళుతున్నాయి. రాత్రిపూట పాములు వచ్చేస్తుండడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సంక్షేమానికి కేటాయిస్తున్న కోట్ల నిధులు ఏమైపోతున్నాయో తెలియని పరిస్థితి.
 
 ఇవీ సమస్యలు
     చిత్తూరు ఎస్సీ హాస్టల్-1లో 45 మంది విద్యార్థులు ఉన్నారు. దుప్పట్లు ఇటీవలే ఇచ్చారు. బాత్రూమ్‌లు సరిగాలేవు. మరుగుదొడ్లను ఉపయోగించే పరిస్థితి లేదు. విద్యార్థులు ఆరుబయటే మలవిసర్జనకు వెళుతున్నారు. పక్కనే ముళ్లపొదలు ఉండడంతో అప్పుడప్పుడూ పాములు హాస్టల్‌లోకి వచ్చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్ర లేకుండా జాగారం చేస్తున్నారు.
 
     సత్యవేడులో ఎస్సీ హాస్టళ్లు-3, బీసీ హాస్టళ్లు-2 ఉన్నాయి. బీసీ బాలుర హాస్టల్ అధ్వానంగా ఉంది. హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. వర్షానికి ఉరుస్తోంది. కిటికీలు, తలుపులు లేవు. విద్యార్థులు చలికి అల్లాడుతున్నారు. ఆరుబయటే మంచులో భోజనం చేస్తున్నారు. తలుపులు లేకపోవడంతో ఆవులు లోపలికి వచ్చి పుస్తకాలు తినేస్తున్నాయి. పాములు వస్తున్నాయి. మొత్తం 150 మందికి ఒకటే మరుగుదొడ్డి.
 
     తిరుపతిలోని ఎస్సీ హాస్టల్‌లో కొందరు విద్యార్థులకే దుప్పట్లు ఇచ్చారు. గత ఏడాది ఇచ్చినవారికి ఈ సారి దుప్పట్లు ఇవ్వలేదు. కింద వేసుకున్న కార్పెట్లను దుప్పట్లుగా కప్పుకుంటున్నారు. చెన్నారెడ్డికాలనీలోని బీసీ హాస్టల్‌లోనూ ఇదే పరిస్థితి. మరుగుదొడ్లు సరిగ్గా లేవు.
 
     తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం మండలాల్లో సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. అన్నీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. బి.కొత్తకోటలో రేకులషెడ్డులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు కాటన్ దుప్పట్లు ఇచ్చారు. ఇవి చలి నుంచి విద్యార్థులకు రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. తంబళ్లపల్లె బీసీ హాస్టల్‌లో కిటికీలు దెబ్బతిన్నాయి. దీంతో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
 
     నగరి నియోజకవర్గంలో 16 హాస్టళ్లు ఉన్నాయి. అన్ని చోట్లా దుప్పట్లు ఇచ్చారు. చాలా చోట్ల భవనాలకు కిటికీలు లేవు. దోమతెరలు ఇవ్వలేదు. దిండ్లు లేవు. కొన్ని హాస్టళ్లకు మాత్రం దోమల నివారణ కాయల్స్ ఇస్తున్నారు.
 
     మదనపల్లె ఎస్సీ హాస్టల్ (బాలురు)లో 69 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ అద్దె భవనంలో నడుస్తోంది. నాసిరకం దుప్పట్లు ఇచ్చారు. విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు.
 
     కుప్పం నియోజకవర్గంలో మూడు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. 220 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరికి దుప్పట్లు ఇచ్చారు. మిగిలిన వారి దగ్గర ఉన్న దుప్పట్లు చిరిగిపోయాయి. విద్యార్థులు చలికి వణుకుతూ నిద్రపోతున్నారు. మంచినీటి సమస్య ఉంది. దూరంగా ఉన్న బోర్లు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
 
     }M>-âహస్తి నియోజకవర్గంలో 18 హాస్టళ్లు ఉన్నాయి. ఇక్కడ కనీస సదుపాయాలు కరువయ్యాయి. విద్యార్థులు అందరికీ దుప్పట్లు లేవు. కొన్ని హాస్టళ్లకు కిటికీలు సరిగ్గా లేవు.
 
     చంద్రగిరి నియోజకవర్గంలోని కస్తూర్బా గురుకుల హాస్టల్‌లో రెండేళ్ల క్రితం బెడ్‌షీట్లు ఇచ్చారు. రామచంద్రపురంలో బీసీ హాస్టల్ ఉంది. ఇక్కడ అరకొర సదుపాయాల మధ్య విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement