
పరీక్ష కేంద్రం వద్ద అస్వస్థతకు గురైన పవన్
రాజాం/సంతకవిటి/శ్రీకాకుళం: కొద్దిసేపట్లో పదో తరగతి పరీక్షను రాయాల్సిన విద్యార్థి గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటన సంతకవిటి మండలం మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రం వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతకవిటి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన అదే గ్రామానికి చెందిన కె.పవన్‌కు మందరాడ కేంద్రాన్ని కేటాయించారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అతను గుండెపోటుతో పడిపోయాడు. అప్రమతమైన పరీక్షల డీవో గోపాలరావు సంతకవిటి పీహెచ్‌సీ వైద్యాధికారి గట్టి భార్గవికి సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది వచ్చి పవన్‌ను పరిశీలించారు. గుండే సంబంధిత వ్యాధి ఉండడంతో విద్యార్థి అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ వాహనం ద్వారా రాజాంలో ఓ ఆస్పత్రికి తరలించారు.
కాగా పరీక్ష కేంద్రం ఆవరణలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోగా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంపై విద్యాశాఖాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ పరీక్ష కేంద్రమైన మందరాడ జిల్లా పరిషత్ హైస్కూల్ చీఫ్ సూపరింటెండెంట్‌పై చర్యల కోసం ఆర్‌జేడీకి నివేదించిన డీఈఓ తన పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. శుక్రవారం ఎవరెవరిపై చర్యలు తీసుకున్నారో వెల్లడించే అవకాశం ఉంది.