అరుదైన వ్యాధిని గుర్తించిన గుంటూరు వైద్యుడు

Guntur Doctor Findout Rare disease - Sakshi

గుంటూరు మెడికల్‌ : పదిలక్షల మందిలో ఇద్దరికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన వ్యాధిని గుర్తించినట్లు గుంటూరు రుమటాలజీ అండ్‌ ఇమ్యునాలజీ సెంటర్‌ నిర్వాహకులు, రుమటాలజిస్ట్‌ డాక్టర్‌ మానుకొండ మురళీకృష్ణ చెప్పారు. సోమవారం గుంటూరు కొత్తపేటలోని ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడుకు చెందిన లక్ష్మీనరసమ్మ వారం రోజుల క్రితం తమ ఆస్పత్రికి వచ్చిందన్నారు. కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం, జాయింట్స్‌ నొప్పులు, జ్వరం వస్తూ పోవడం వంటి లక్షణాలతో బాధపడుతూ వచ్చిందని తెలిపారు. ఏడేళ్లుగా అనారోగ్యం ఆమెను వేధిస్తూ ఉండటంతో రక్తపు శాంపిళ్లు బెంగళూరు పంపించి వైద్య పరీక్షలు చేయగా ‘ సీరం ఐజిజి4 సంబంధిత వ్యాధి’గా నిర్థారణ జరిగిందన్నారు.

ఈ వ్యాధి రావడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు ఉండవని, మధ్య వయస్సు వారికి, వృద్ధుల్లో ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి, అలర్జీలు ఉన్నవారికి, రోగ నిరోధకశక్తిలో మార్పులు ఉన్నవారికి సీరం ఐజిజి4 లెవల్స్‌ ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా జపాన్‌లో ఉందని, మన దేశంలో పదిలక్షల మందిలో ఇద్దరికి మాత్రమే ఈ వ్యాధి వస్తుందన్నారు. జాయింట్స్‌ నొప్పులు, నోటిలో లాలాజలం ఊరకపోవడం, కళ్లల్లో తడి ఆరిపోవడం, గ్రంథుల్లో వాపులు తదితర లక్షణాలు వ్యాధి సోకినవారిలో కనిపిస్తాయన్నారు. వ్యాధిని నియంత్రణలో పెట్టేందుకు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధిని నియంత్రణలో పెట్టకపోతే కిడ్నీలు, ఊపిరితిత్తులు, చెవి ముక్కు గొంతు అవయవాలు దెబ్బతింటాయని, నరాల వ్యవస్థ సైతం బలహీనపడిపోతుందని వెల్లడించారు. ఈ వ్యాధిని నిర్థారణ చేయటం చాలా కష్టమని, సకాలంలో వ్యాధి నిర్థారణ చేస్తే ప్రాణాలు పోకుండా కాపాడవచ్చని డాక్టర్‌ మురళీకృష్ణ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top