నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

Government Construct Airport In PSR Nellore - Sakshi

పాత కాంట్రాక్ట్‌ రద్దుకు సిఫార్సు

ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు పనుల అప్పగింత

ఎన్నికల వేళ హడావుడిగా చంద్రబాబు శంకుస్థాపన

గ్రీన్‌ ఫీల్డ్‌ నుంచి బుల్లి ఎయిర్‌పోర్టుకు మార్చిన వైనం

జిల్లాలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు కల సాకారం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్‌కు గత ప్రభుత్వాలు గ్రహణం పట్టించాయి. ఎయిర్‌పోర్టు ప్రజల ఆకాంక్ష ఇన్నేళ్లుగా గాల్లోనే ఉండిపోయింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అంతర్జాతీయ విమానాశ్రయం కాస్త బుల్లి ఎయిపోర్టుగా మారిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఊరించి ఎన్నికల ముందు హడావుడి చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు నెల ముందు అట్టహాసంగా శంకుస్థాపన చేసింది. నెలలు గడుస్తున్నా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఈ దశలో పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా నుంచి ప్రతిపాదనలు కూడా పంపారు. 24 నెలల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలనే యోచనతో పనులను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అప్పగించాలని కోరినట్టు తెలిసింది.

సాక్షి , నెల్లూరు:  2014 ఎన్నికలకు ముందు జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎయిర్‌పోర్టు ఒకటి. అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా నాలుగేళ్ల పది నెలల పాటు అదిగో.. ఇదిగో అంటూ ఊరించి కాలక్షేపం చేశారు. ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో జిల్లాలో దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్‌పోర్టుకు సీఎం హోదాలో చంద్రబాబు శంకుస్థాపన హడావుడి చేశారు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన అట్టహాసంగా ఫైలాన్‌ను ఆవిష్కరించారు. 2020 నాటికి విమానాశ్రయం నిర్మాణం పూర్తి అవుతుందని, 2045 కల్లా ఏటా 20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని,  55 వేల టన్నుల సరుకుల రవాణాతో కార్గో సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని జిల్లాకు రోడ్డు రవాణా, జలరవాణా అనుకూలంగా ఉండటంతో వాయు రవాణా బాగా ఉపయోగపడుతుందని ఆయన భవిష్యత్‌ ఊహలు చెప్పారు. 

గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బుల్లి ఎయిర్‌పోర్టు
 దామవరం వద్ద గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బుల్లి ఎయిర్‌పోర్టుకు మార్చి ప్రైవే ట్‌ కాంట్రాక్టర్లతో  నిర్మాణం చేయించాలని హడావుడిగా పనుల్ని అప్పగించారు. 158 ఎకరాల్లో రూ.368 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్ట్‌ను ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో అనుభవం ఉన్న వారికి కాకుండా శీనయ్య అండ్‌ కంపెనీకి కేటాయిం చారు.  శంకుస్థాపన జరిగిన జనవరి 11వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. సదరు కంపెనీ బ్యాంక్‌ గ్యారెంటీలు సక్రమంగా చూపించకపోవడం, పనులు మొదలు పెట్టకపోడం ఇతర కారణాలతో టెండర్‌ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియానే నిర్మించాలని కేంద్రానికి సైతం ప్రతిపాదనలు పంపనున్నారు. ఇప్పటికే జరిగిన సంప్రదింపుల్లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసిన క్రమంలో రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

వైఎస్సార్‌ ఆశయం..
జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం నిర్మాణం చేయాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయం. వాస్తవానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్సార్‌ కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తామని ప్రకటించారు. అవసరమైన భూసేకరణ పనులు నిర్వహించాలని అప్పటి కలెక్టర్‌ను ఆదేశించారు. విమానాశ్రయం నిర్మాణానికి  2,600 ఎకరాల భూమి అవసరమని ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దామవరం వద్ద భూమిని సూచిస్తూ ప్రతిపాదనలు పంపడంతో  ఏఏఐ అత్యున్నత స్థాయి బృందం 2,480 ఎకరాల పరిధిలో విమానాశ్రయ నిర్మాణానికి అంగీకారాన్ని తెలియజేసింది.

అయితే మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించడంతో, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలుత రూ. 4,650 కోట్లతో గ్రీన్‌ఫీల్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నామని, ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం అయిందని రెండేళ్ల పాటు హడావుడి చేశారు. చివరకు రకరకాల కారణాలతో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాస్త బుల్లి పోర్టుగా మారిపోయింది. చివరకు 153 ఎకరాల్లో రూ. 368 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రతిపాదన ఫైనల్‌ అయింది. దానిని కూడా తమ పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కే కట్టబెట్టారు. ఆయన కూడా పనులను చేపట్టకపోవడంతో కాంట్రాక్టు రద్దు చేయనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top