విలువైన ఎర్రచందనం చెట్లను కాపాడేందుకు ఒకవైపు అటవీ అధికారులు, మరోవైపు పోలీసు యంత్రాంగం ఎన్ని ఎత్తులు వేస్తున్నా వాటిని స్మగ్లర్లు చిత్తు చేస్తూనే ఉన్నారు.
విలువైన ఎర్రచందనం చెట్లను కాపాడేందుకు ఒకవైపు అటవీ అధికారులు, మరోవైపు పోలీసు యంత్రాంగం ఎన్ని ఎత్తులు వేస్తున్నా వాటిని స్మగ్లర్లు చిత్తు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసినా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ఇందుకు నిదర్శనం రోజూ పట్టుబడుతున్న దుంగలు, దొంగలే నిదర్శనం. తాజాగా మంగళవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలుతున్న దుంగలను అధికారులు పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అటవీ దొంగలదే పైచేయి అన్పిస్తోంది.
ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: కడప-చెన్నై జాతీయ రహదారిలోని కొత్తమాధవరంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఓ కారును మంగళవారం తెల్లవారుజామున సిబ్బంది పట్టుకున్నారు. వాటిని తనిఖీ చేయగా అందులో 13 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామని రేంజర్ హయ్యద్ తెలిపారు. రాజంపేట వైపు నుంచి కడప వైపునకు వచ్చిన ఓపెన్‌ఆల్ట్రా కారుతో పాటు దుంగలను తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు. వారు కర్ణాటకకు చెందిన నయూమ్, ఆసిఫ్‌గా గుర్తించామన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రెడ్డయ్య, సెక్షన్ ఆఫీసర్ లక్ష్మీకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో...
ఇటుకుల్లపాడు బీట్‌లో మంగళవారం అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి, లింగాలదిన్నెపల్లెకు చెందిన శ్రీనివాసులును అరెస్టు చేసి వారి నుంచి నాలుగు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి పంపిస్తామని అటవీ సిబ్బంది తెలిపారు.
వీరబల్లెలో...
శీతంపేట సమీపంలో పాన మంగళవారం టాటా మ్యాక్స్‌లో తరలిస్తున్న 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దుంగలను తరలిస్తున్న గుంతరాజుపల్లె దళితవాడకు చెందిన వెంకటరమణను అదుపులోకి తీసుకున్నామన్నారు.
రైల్వేకోడూరు రూరల్‌లో...
కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో మురళీ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని రైల్వేకోడూరు రేంజ్ అధికారి శ్రీరాములు తెలిపారు. దాడిలో ఎఫ్‌బీఓ లింగారెడ్డి, సిబ్బంది శ్రీరామమూర్తి పాల్గొన్నారు.