వచ్చే ఉగాది నుంచి భగవంతుడి ఆశీస్సులు భక్తులకు అందించడానికి భక్తబృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ...
మంత్రి మాణిక్యాలరావు
నూజివీడు : వచ్చే ఉగాది నుంచి భగవంతుడి ఆశీస్సులు భక్తులకు అందించడానికి భక్తబృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. కృష్ణాజిల్లా నూజివీడులో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో 50 నుంచి 100 మందితో ఈ బృందాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఈ బృందాలు బిడ్డలు పుట్టిన సమయంలోను, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం, నామకరణం సమయాల్లో భజన చేస్తూ వారి ఇళ్లకు వెళ్లి ఆశీర్వదిస్తాయని చెప్పారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే 12రోజుల తరువాత స్థానిక శివాలయం నుంచి అభిషేక జలాన్ని తీసుకుని చనిపోయిన వ్యక్తి ఇంట్లో సంప్రోక్షణ చేసి, అరగంట సేపు భజన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు.
దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిలో 90 శాతం మంది రాజకీయ నాయకులేనని చెప్పారు. కోర్టు తీర్పులు వచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. దేవాదాయ శాఖలో 23వేల సిబ్బంది అదనంగా ఉన్నారని, ఈవో స్థాయి పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి రూ.2300కోట్లను కేంద్రప్రభుత్వం అందజేసిందన్నారు. దేశం మొత్తంలో ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలోని పేదల కోసం ఒక లక్షా 86వేల గృహాలను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్ దొరై, జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.