ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు

Godavari board directs to Telugu states on new projects - Sakshi

కొత్త ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలకు గోదావరి బోర్డు ఆదేశం

కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఈ నెల 10లోగా ఇవ్వాలి

అపెక్స్‌ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాలను పంపాలని రాష్ట్రాలకు సూచన

గోదావరి జలాల్లో తెలంగాణకు 967 టీఎంసీల వాటా వాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్‌

ట్రిబ్యునల్‌ తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపాలని ప్రశ్న

నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్ల ఏర్పాటుకు బోర్డు నిర్ణయం

దామాషా పద్ధతిలో పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ వ్యయం

సాక్షి, అమరావతి: కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. తెలంగాణలో కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్‌లు ఇవ్వాల్సిందేనని ఇరు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌కు తక్షణమే అజెండాను పంపాలని మరోసారి సూచించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన గోదావరి బోర్డు సమావేశమైంది. రాష్ట్ర  జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, బోర్డు సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. 

సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతే ప్రాతిపదిక
విభజన తర్వాత అంటే 2014 జూన్‌ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు.

450.31 టీఎంసీల తరలింపు పనులు...
► తెలంగాణ సర్కార్‌ గోదావరిపై కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని ఆ రాష్ట్ర అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘గోదావరి బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 225 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల, 22 టీఎంసీల సామర్థ్యంతో జీఎల్‌ఐఎస్‌–3, 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల, 100 టీఎంసీలతో తుపాకులగూడెం, 23.76 టీఎంసీలతో తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు, 0.35 టీఎంసీల సామర్థ్యంతో భీమ్‌కుంద్‌ బ్యారేజీ, ఐదు టీఎంసీలతో చనాఖా–కోరటా, 1.20 టీఎంసీలతో పింపరాడ్‌–పర్సోడా బ్యారేజీల నిర్మాణాన్ని తెలంగాణ  చేపట్టింది. రామప్ప లేక్‌ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు ద్వారా మూడు టీఎంసీలు వెరసి 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్‌ పనులు చేపట్టింది’ అని ఏపీ అధికారులు వివరించారు. 

డెల్టా, పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం...
► తెలంగాణ సర్కార్‌ కాళేశ్వరం ఎత్తిపోతల సామర్థ్యాన్ని 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతల సామర్థ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల 150 ఏళ్ల చరిత్ర ఉన్న గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రిబ్యునల్‌ కేటాయింపులే ప్రామాణికం..
► గోదావరి జలాల్లో 967 టీఎంసీలను వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారని, దీని ఆధారంగా తమ రాష్ట్రానికి గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉన్నట్లు స్పష్టమవుతోందని, వాటా జలాలను వినియోగించుకోవడానికే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ అధికారులు పేర్కొనడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులకు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే ప్రామాణికమని, అందులో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేశారో చూపాలని ఏపీ అధికారులు ప్రశ్నించారు.

కాళేశ్వరంతో సహా అన్ని డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే...
► ఈ దశలో గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ జోక్యం చేసుకుంటూ కాళేశ్వరం సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెంటనే అందజేయాలని సూచించారు. తాము పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల డీపీఆర్‌లను ఇప్పటికే ఇచ్చామని, చింతలపూడి సామర్థ్యం పెంపు డీపీఆర్‌ను అందచేస్తామని ఏపీ అధికారులు తెలిపారు. తమ ప్రభుత్వంతో చర్చించి కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తామని తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. 
► పట్టిసీమ, పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి జలాలకుగానూ కృష్ణా నీటిలో తమకు 45 టీఎంసీల వాటా అదనంగా ఇవ్వాలని తెలంగాణ అధికారులు పేర్కొనటంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌ తీర్పు ఉమ్మడి రాష్ట్రానికి వర్తిస్తుందని, నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ఆ 45 టీఎంసీలు దక్కుతాయని, ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–2) తేల్చుతుందని స్పష్టం చేశారు.

టెలిమెట్రీకి అంగీకారం..
► గోదావరి జలాల వినియోగం లెక్కలను తేల్చడానికి టెలీమీటర్లు ఏర్పాటు చేయాలన్న బోర్డు ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించేందుకు సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీపీడబ్ల్యూఆర్‌ఎస్‌ (పుణే) అధికారులతో కమిటీని నియమించాలని బోర్డు నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా టెలీమీటర్ల ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
► పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో కేటాయించాలన్న గోదావరి బోర్డు ప్రతిపాదనను ఇరు రాష్ట్రాలు ఆమోదించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top