ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌

Gas leak from tanker at Ravulapalem - Sakshi

టోల్‌ ప్లాజా వద్ద ఘటన

ప్రెజర్‌ వాల్వ్‌ నాబ్‌ విరిగిపోవడంతో లీకైన ఎల్‌పీజీ

మరో ట్యాంకర్‌ డ్రైవర్‌ చొరవతో తప్పిన ప్రమాదం

రావులపాలెం: ఎల్‌పీజీ గ్యాస్‌తో వెళుతున్న ట్యాంకర్‌ను క్రేన్‌తో వెళుతున్న లారీ వెనుకనుంచి ఢీ కొట్టడంతో గ్యాస్‌ లీకైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్‌ప్లాజా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పటంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని ఎల్‌పీజీ ప్లాంట్‌లో 17,920 కేజీల గ్యాస్‌ను నింపుకున్న ఒక ట్యాంకర్‌ హైదరాబాద్‌లోని చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌కు బయలుదేరింది. ఆ ట్యాంకర్‌ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగా.. దాని వెనుక వస్తున్న లారీలోని క్రేన్‌ కొక్కెం ట్యాంకర్‌ వెనుక భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్‌కు గల ప్రెజర్‌ వాల్వ్‌ నాబ్‌ విరిగిపోయి గ్యాస్‌ లీకైంది.

పెద్ద శబ్దంతో గ్యాస్‌ బయటకు రావడంతో టోల్‌ప్లాజా సిబ్బంది, రహదారి వెంబడి ఉన్న వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు. హైవే సిబ్బంది అప్రమత్తమై రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. కొత్తపేట, మండపేట, అమలాపురం, తణుకు పట్టణాల నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గ్యాస్‌ ట్యాంకర్‌పై నీళ్లు చల్లుతూ నిప్పంటుకోకుండా చూశారు. సుమారు రెండు గంటల పాటు గ్యాస్‌ లీకవుతూనే ఉంది. కాగా, ఈ గ్యాస్‌ ట్యాంకర్‌కు ముందు వెళుతున్న మరో గ్యాస్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ జార్ఘండ్‌కు చెందిన ఇర్ఫాన్‌ ఆలామ్‌ ఒక చెక్క ముక్కను గ్యాస్‌ లీకవుతున్న రంధ్రంలోకి నెట్టి ‘ఎంసీల్‌’ పూశాడు.

ఈ చర్యలు ఫలితమిచ్చి గ్యాస్‌ లీకేజీ అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో హైవేపై రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా, సీఐ వి.కృష్ణ, ఎస్‌ఐ పి.బుజ్జిబాబు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ డైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. టోల్‌ ప్లాజా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై హైవే అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top