గాంధీ మార్గం.. అనుసరణీయం

Gandhi Jayanti Special story - Sakshi

బ్రిటిష్‌ పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం మహాత్మాగాంధీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ... తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం. అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టిన తీరు అద్భుతం. ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బాపూజీ. తరాలు.... యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. గాంధీ అహింస సిద్ధాంతం కాలాతీతం. దానికి మరణం లేదు. ఈ నేపథ్యంలోనే మహాత్ముడి 150వ జయంతిని బుధవారం ఉత్సవంలా అంగరంగవైభవంగా చేయడానికి జిల్లా సిద్ధమైంది. ఇందులో భాగంగానే జిల్లాలో గాంధీ నడియాడిన ప్రాంతాలు, విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

అనంతలో మహాత్ముడి అడుగుజాడలు 
సాక్షి , అనంతపురం : స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ చాలా పర్యాయాలు అనంతలో పర్యటించారు. 1921లో లోకమాన్య తిలక్‌ నిధి వసూలు కార్యక్రమంలో,  1929లో ఖద్దరునిధి వసూలు కార్యక్రమంలో, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలో గాంధీజీ విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లావాసులు హార్థికంగా, ఆర్ధికంగా ఆదరించారు. భక్తి నీరాజనాలర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచారు.  గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు.  

దురాచారాలు రూపుమాపండి 
1921, సెప్టెంబర్‌ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. హిందూముస్లింల ఐక్యత గురించి, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను విడనాడాలని ఆ రోజుల్లో గాంధీజీ బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే నడిచారు.  

అప్పుడే ఖద్దరు కట్టారు.. 
1929, మే 16న మరోసారి అనంత పర్యటనకు గాంధీజీ వచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి రాత్రికి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసగించిన అనంతరం ఆయన అనంతపురానికి చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో బ్రిటీష్‌ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులందరూ భారతీయత ఉట్టిపడే ఖద్దరు కట్టారు. అనంతరం గాంధీజీ  తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్‌ మాస్టర్‌ ‘107’ అక్షరాలు రాసి బహుకరించిన  బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330లు నిధి వసూలైంది.  

అడుగడుగునా విరాళాల వెల్లువ..
1934లో  గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుండి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకు మహదేవ (ఏడేళ్ల కుర్రాడు) గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని వారందరినీ సంఘటితపరిచారు. అక్కడ నుండి అనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కొళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల బేధభావం రూపుమాపాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకూ తనకు మనశ్శాంతి లేదని పేర్కొన్నారు.  

గాంధీ పేరుతో వీధులు 
గాంధీజీ అడుగుపెట్టిన జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్యులు గాంధీజీ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా ఘనంగా నివాళులర్పించడం పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా మారింది. గాంధీజీ తిరిగిన స్థ«లంగా భావించి పాతూరు ప్రధాన వీధికి గాంధీ బజారుగా నామకరణం చేశారు. నాలుగు కూడళ్ల మధ్యన నిలువెత్తు గాంధీజీ విగ్రహం అందరిని పలకరిస్తున్నట్లు అగుపిస్తుంది. ముఖ్యంగా  కొత్తూరు ఆర్యవైశ్య సంఘం గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ సమీపంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహాన్ని పోలిన విధంగా భారీ ఎత్తున మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని బుధవారం రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. శాంతి ర్యాలీలు, మానవహారాలు, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఉరవకొండలో మహాత్ముడు 
జాతిపిత మహత్మాగాంధీ పాదస్పర్శతో 1934, మార్చిన ఉరవకొండ పునీతమైంది. విరాళాల సేకరణకు గాంధీజీ ఉరవకొండకు వచ్చారు.  అప్పట్లో మహత్మ గాంధీ వెంట మాఘం సుబ్బరాయుడు, ఉప్పరగోవిందప్ప,ఎంసీ నరసింహులు, రామప్ప, బాబా సాహెబ్, నరసింహరెడ్డిలు ఉన్నారు. గాంధీ నడియాడిన పాత బజారుకు గాంధీ బజారు అని నేటికీ పిలుస్తున్నారు. ఆ రోజుల్లో గాంధీ ప్రసంగించిన చోటున స్వాతంత్య్ర సమరయోధుల చిహ్నం ఏర్పాటు చేశారు.  


గుత్తి కోటలో 1946, అక్టోబర్‌ 2న గాంధీ పుట్టిన రోజును జరుపుతున్న దృశ్యం  

మహాత్ముడు ప్రసంగించిన వేదిక 
దండి సత్యాగ్రహంలో భాగంగా 1925లో తాడిపత్రి పట్టణానికి మహాత్మా గాంధీ వచ్చారు. ఆ సమయంలో బాపూజీ సందేశాన్ని వినేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా స్థానిక నాయకులు పరిశీలించి ఓ ప్రాంతానికి ఎన్నుకుని అరుగు నిర్మించారు. ఆ అరుగుపై నుంచి గాంధీ ప్రసంగించారు. అప్పటి నుంచి ఆ అరుగుకు గాంధీ కట్ట అని పిలుస్తూ వచ్చారు.  
– తాడిపత్రి  

మధుర జ్ఞాపకం 
స్వాతంత్య్ర సమరం ఊపందుకున్న 1934లో పెద్దవడుగూరు గ్రామాన్ని గాంధీజీ సందర్శించారు. గ్రామానికి చెందిన కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు గాంధీజీ ఇక్కడకు రావడం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. గుత్తి నుంచి ప్రత్యేకంగా తన కారులో చిన్నారపరెడ్డి ఆయనను ఇక్కడకు పిలుచుకువచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ స్థానికులు విరాళాలు అందజేశారు. ఆ సమయంలో తన వంతు విరాళంగా రూ.1,116ను చిన్నారపరెడ్డి అందజేశారు.  ఆ డబ్బును కీర్తి శేషులు కేశవపిళై స్మతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించబడే కేశవ విద్యాలయానికి విరాళంగా గాంధీ ప్రకటించారు. ఈ అంశాలను నాటి ఆంధ్రపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక నేటికీ చిన్నారపరెడ్డి కుటుంబసభ్యలు భద్రంగా దాచి ఉంచారు.      
– పెద్దవడుగూరు 

గుత్తి రైల్వే స్టేషన్‌లో గాంధీ 
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్య పరుస్తూ 1931, నవంబర్‌ 21న గుత్తి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ అడుగుపెట్టారు. ఖద్దర్‌ నిధి వసూలు కార్యక్రమంలో భాగంగా పెద్దవడుగూరుకు వెళ్లడానికి ఆయన రైలు వస్తూ గుత్తిలో దిగారు. గుత్తి, పెద్దవడుగూరు ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయో«ధులు గుత్తి కేశవపిళ్లై, పీజే శర్మ, కుమ్మెత చిన్న నారప్పరెడ్డి, పామిడి తిరుపతిరావు, శరభారెడ్డి(చిన్న శరబయ్య),  తదితరులు రైల్వే స్టేషన్‌లో ఆయనకు స్వాగతం పలికారు. పెద్దవడుగూరుకు చెందిన చిన్న నారప్పడ్డి తన సొంత కారులో గాంధీజీని ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ తన గ్రామానికి పిలుచుకెళ్లారు. అక్కడ ఖద్దర్‌ నిధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. గాంధీజీ జోలి పట్టి అడగడంతో మొత్తం రూ. 27వేలు వసూలైంది. ఆ సమయంలో తమ శరీరంపై ఉన్న బంగారాన్ని కూడా మహిళలు స్వచ్ఛందంగా అందజేశారు.  
– గుత్తి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top