వరద కష్టాలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన కుంజా రాజులు (35) జ్వరంతో బాధపడుతూ సమయానికి వైద్యం అందక బుధవారం మృతి చెందాడు.
కూనవరం, న్యూస్‌లైన్: వరద కష్టాలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన కుంజా రాజులు (35) జ్వరంతో బాధపడుతూ సమయానికి వైద్యం అందక బుధవారం మృతి చెందాడు. మృతుడి తల్లి కుంజా లాలమ్మ కథనం ప్రకారం... పది రోజుల క్రితమే రాజుకు జ్వరం వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల క్రితం పరిస్థితి మరింత విషమించింది. చుట్టూ వరద నీరు చేరుకోవడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి కూడా తల్లి తీసుకెళ్లలేకపోయింది. తాను ఒంటరిగా ఉండ డం వల్లే కొడుకును తరలించలేకపోయాయనని, వైద్యం అందక అతడు మృత్యువాత పడ్డాడని లాలమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఒక్కగానొక్క కుమారుడు తనవుచాలించడంతో దిక్కులేని దానినయ్యాయని బోరున విలపిస్తోంది.
నాలుగురోజుల్లో నలుగురు...
వరద నీరు చుట్టుముట్టడంతో మండలంలో నాలుగురోజుల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కూనవరంలో షేక్ మీరా ఉద్దీన్ మృతిచెందిన మర్నాడు నుంచి టేకులబోరులో వరసగా సూరం కమల, ఏడ్ల వేదవతి, కుంజా రాజులు మృత్యువాత పడ్డారు. ఇలా వరుస మరణాలతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికార్లు తక్షణం స్పందించి విస్తృతంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.