కొనసాగుతున్నవరద పోటు..

Flood flow to Krishna and Godavari - Sakshi

కృష్ణా, గోదావరిలకు భారీగా వరద ప్రవాహం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/ధవళేశ్వరం(రాజమహేంద్రవరం రూరల్‌)/సాక్షి ప్రతినిధి, ఏలూరు/శ్రీశైలంప్రాజెక్ట్‌ : గోదావరి, కృష్ణా నదులు వరదతో పోటెత్తుతున్నాయి. శనివారం కృష్ణా నదిలో వరద ప్రవాహాం భారీగా పెరగడంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను పది అడుగుల మేరకు తెరిచి నాగార్జునసాగర్‌కు 2,13,584 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ల్లో కురిసిన వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతిల నుంచి వస్తున్న ప్రవాహాలకు శబరి, సీలేరు, తాలిపేరు వరద తోడవడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తడంతో 30కి పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

కృష్ణాలో పెరిగిన వరద..
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర జలాశయం నుంచి వదిలిన ప్రవాహం తోడవడంతో రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. శ్రీశైలం డ్యాంకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో శనివారం ఉదయం 8.40 గంటలకు రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారానూ నీటి విడుదల ప్రారంభించారు. డ్యాంనీటి మట్టం 881 అడుగులకు చేరుకోగా.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్‌ ఆన్‌చేసి గేట్లను తెరిచారు. శ్రీశైలం దేవస్థానం వేదపండితులు కృష్ణమ్మకు హారతి ఇవ్వగా మంత్రి దేవినేని వాయనం సమర్పించారు. ముందుగా నాలుగు రేడియల్‌ క్రస్ట్‌గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు. సా.4 గంటల సమయానికి వరద ప్రవాహం పెరగడంతో మరో రెండు గేట్లను తెరిచారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంకొక గేటు ఎత్తారు. రాత్రి 11గంటల సమయంలో మొత్తం ఎనిమిది గేట్ల ద్వారా 2,13,584 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. అలాగే రెండు పవర్‌హౌస్‌ల్లో విద్యుత్‌ ఉత్పాదన అనంతరం మరో 72,872 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదలవుతున్నాయి.

బ్యాక్‌వాటర్‌ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 30,425 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 881.90 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ 198.36 టీఎంసీలు ఉంది. ఎగువ ప్రాంతాల (జూరాల, సుంకేసుల) నుంచి జలాశయానికి 2,67,137 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి మొత్తం 2,89,861 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. మరో 3 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందని కేంద్ర జలసంఘం తెలపడంతో ఔట్‌ఫ్లో పెంచారు. మున్నేరు, వైరా, కట్టలేరు వాగుల నుంచి వరద వస్తోండటంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉ.6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 10,281 క్యూసెక్కులు రాగా సాయంత్రం 6 గంటలకు వరద 14,098 క్యూసెక్కులకు పెరిగింది. కాలువలకు 10 వేల క్యూసెక్కులు విడుదల చేసి మిగతా నీటిని మూడు గేట్లు తెరిచి సముద్రంలోకి వదులుతున్నారు.

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 14,15,000 క్యూసెక్కుల నీరు రాగా కాలువలకు 6,700 క్యూసెక్కులు విడుదల చేసి మిగతా 14,08,300 క్యూసెక్కులను 175గేట్లు ఎత్తేవేసి కడలిలోకి వదిలారు. సా.6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరదప్రవాహం 12,88,442 క్యూసెక్కులకు తగ్గింది. శుక్రవారం ఉ.6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు 121.677 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. శనివారం సా.6 గంటలకు 13.70 అడుగులకు తగ్గడంతో ఇరిగేషన్‌ అధికారులు బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా తగ్గుతుండటంతో ఆదివారం నాటికి ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికనూ ఉపసంహరించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

బ్యారేజ్‌ వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా శనివారం పరిశీలించారు. శనివారం రాత్రి 7 గంటలకు బ్యారేజ్‌ నుంచి 12,75,162 క్యూసెక్కుల వరదను దిగువకి విడుదలచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఆలయాలన్నీ శుక్రవారం రాత్రి నుంచి వరద ముంపులోనే ఉన్నాయి. ఆదివారం ఉదయానికి ఈ క్ష్రేత్రం వరద ముంపు నుంచి బయటపడే అవకాశం ఉంది. వేలేరుపాడు మండలంలో టేకూరు నుంచి కటుకూరు మధ్య రెస్క్యూబోటు సాయంతో జనాలను తరలిస్తున్నారు. 

వశిష్టగోదావరి ఉధృతరూపం దాల్చడంతో పాలకొల్లు మండలం భీమలాపురం నుంచి ఆచంట మండలం అయోధ్యలంక వరకూ ఉన్న పలు లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లోని వేల ఎకరాల్లో ఉన్న  పంటలు నీట మునిగాయి. పోలవరంలో కొత్తూరు కాజ్‌వే, కడెమ్మ బ్రిడ్జి నీట మునగడంతో ఇంకా 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ చానల్‌లోకి నీరు ప్రవేశించడంతో అక్కడి పనులు నిలిచిపోయాయి. స్పిల్‌వే పనులు కూడా వర్షాల కారణంగా నెమ్మదిగా సాగుతున్నాయి. కాగా, ఒడిశాలో వర్షాలు కొనసాగుతుండటంతో వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం నిలకడగా ఉంది. 

జలదిగ్బంధంలో లంక గ్రామాలు
కాగా, వరద పోటుతో ఉగ్రరూపం చూపించిన గోదావరి శనివారం సాయంత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏజెన్సీని వణికించిన శబరి నది శాంతించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు భారీ వరద ముప్పు తగ్గింది. నదుల్లో నీటిమట్టాలు తగ్గుముఖం పట్టినా వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల కాజ్‌వేలు, రహదారులు నీట మునిగాయి. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో అక్కడి ప్రజలు ముంపు నీటిలోనే గడుపుతున్నారు.గోదావరి వరదకు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. జిల్లాలోని 25 లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. కాజ్‌వేలు, రహదారులపై భారీగా వరద నీరు పొంగి ప్రవహించడంతో 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వీటిలో అత్యధిక గ్రామాలు ఏజెన్సీలోని విలీన మండలాల పరిధిలోనివే. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగుపల్లి వద్ద చొల్లంగి సోమశేఖర్‌ (32) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలోపడి గల్లంతయ్యాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top