షికారుకు గడ్డుకాలం | fishermans lives in Vijayapuri South | Sakshi
Sakshi News home page

షికారుకు గడ్డుకాలం

Jun 22 2014 12:48 AM | Updated on Sep 5 2018 8:24 PM

షికారుకు గడ్డుకాలం - Sakshi

షికారుకు గడ్డుకాలం

పొట్టచేత పట్టుకుని యాబై ఏళ్ల కిందట విశాఖ నుంచి విజయపురిసౌత్‌కు వచ్చిన మత్స్యకార కుటుంబాలు కృష్ణానది ఒడ్డున జీవనం సాగిస్తున్నాయి.

- కృష్ణమ్మను నమ్ముకున్న వందలాది కుటుంబాలు
- యాభై ఏళ్లుగా ఎదుగూ బొదుగూ లేని జీవితాలు
- సాగర్ జలాశయంలో మొన్న మరబోట్లు..
- నేడు వేటపై నిషేధం షికారు సాగక పస్తులుంటున్న మత్స్యకారులు
- ఉపాధి లేక వలసలు పోతున్న వైనం
ఐదు దశాబ్దాలుగా కృష్ణమ్మనే న మ్ముకున్నారు.. ముంచినా తేల్చినా నీవే దిక్కని ఆ నదీమ తల్లిపైనే భారం వేశారు. నది ఒడ్డే వారికి నివాస స్థలం.. చేపల వేటే జీవనాధారం. ఎర్రటి ఎండను.. ఎముకలు కొరికే చలిని.. తుఫాను తాకిడిని దేన్నీ లెక్క చేయక రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు కష్టపడినా నాలుగు రాళ్లు వెనుకేసుకోలేక పోయారు. చాలీచాలని సంపాదన తో బతుకీడుస్తున్న వారికి ఈ ఏడాది మరింత గడ్డు పరిస్థితులు దాపురించాయి. వేట సాగక.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పస్తులుంటున్నారు. కనీసం తమకు ఉపాధి హామీ పనులైనా కల్పించాలని వేడుకొంటున్నారు.

 
విజయపురిసౌత్ : పొట్టచేత పట్టుకుని యాబై ఏళ్ల కిందట విశాఖ నుంచి విజయపురిసౌత్‌కు వచ్చిన మత్స్యకార కుటుంబాలు కృష్ణానది ఒడ్డున జీవనం సాగిస్తున్నాయి. సాగర్ జలాశయాన్ని నమ్ముకుని స్థానిక డౌన్‌మార్కెట్, సాగర్ క్యాంప్‌లలో నివసిస్తున్నారు. ప్రభుత్వం అందించే పక్కా ఇళ్లు కూడా మంజూరు కాలేదు. 110 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న జలాశయం చుట్టూ పుట్టీలే నివాసాలుగా నదిలో షికారు(వేట) చేస్తున్నారు. ఏళ్ల తరబడి నిత్యం శ్రమిస్తున్నా వీరి జీవిత గమనంలో మార్పు రాలేదు. రోజు మొత్తం షికారు చేసినా చేపలు చిక్కని దైన్యస్థితి.
 
కుటుంబ పోషణకు తప్పని అప్పులు.. నాగార్జునసాగర్ జలాశయంలో నీరు తగ్గిపోవటంతో పాటు మత్స్యశాఖ రెండేళ్లుగా జలాశయంలో చేపపిల్లలు వదలడం లేదు. దీంతో చేపల షికారు జరగక మత్స్యకారులు కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వీరు చేపల వ్యాపారుల వద్ద కుటుంబపోషణకు ముందుగానే అడ్వాన్స్‌లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు.

ఈ క్రమంలో రెణ్నెల్ల కిందట అటవీశాఖ అధికారులు కృష్ణానదిలో మరబోట్లను నిషేధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగు నెలల పాటు సాగర్ జలాశయంలో చేపలు పట్టడం నిషేధించారు. షికారు సాగక పస్తులుండలేక పనుల కోసం వలస బాట పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవటంతో పుట్టీలతో సహా వాహనాల్లో తరలిపోతున్నారు.
 
ఇంతటి గడ్డు పరిస్థితి ఎన్నడూ లేదు.. గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన తుపాన్లకు సాగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చిన వరదలతో జలాశయం నిండింది. ఆ నెల 25వ తేదీన 12 గేట్లెత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో పైనుంచి మురికినీరు రావడం వల్ల చేపలు గేట్ల ద్వారా చాలా వరకు దిగువ కృష్ణానదిలోకి వెళ్లిపోయాయని మత్స్యకారులు తెలిపారు. పనిలేక ఒక్కపూటైనా కడుపు నింపుకోలేక పోతున్నామని, ఇంతటి చేపల కరువు డ్యాం నిర్మాణం నుంచి రాలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేయాలని, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం లోనైనా పని ఇప్పించి ఆదుకోవాలని అర్థిస్తున్నారు.
 
ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలి.. సాగర్ జలాశయంలో చేప పిల్లలను వదిలి రెండేళ్లయింది. చేపలు షికారు జరగక వందలాది కుటుంబాలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయినా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. మత్స్యకారులను ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవటం వలనే ఈ దుస్థితి నెలకొంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కనీసం ఉపాధి పనులన్నా కల్పించి, ఉచితంగా బియ్యం పంపిణీ చేయకపోతే కాలనీలన్నీ వలసపోయే పరిస్థితి ఉంది.                      
 - మైలపల్లి నూకరాజు,
 
కనకదుర్గ ఫిషర్‌మెన్ సొసైటీ అధ్యక్షుడు, విజయపురిసౌత్
గోడకడితే  షికారుకు సెలవే.. రెక్కాడితే కానీ డొక్కాడని మేం చేపల షికారు జరగక ఆకలితో అల్లాడిపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి. డ్యాం భద్రత పేరుతో కృష్ణా జలాశయం ఒడ్డున భద్రత గోడను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే మా పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. జలాశయంలోకి వెళ్లే అవకాశం ఉండదు. డ్యాం అధికారులు జలాశయంలోకి వెళ్లేందుకు మత్స్యకారుల కోసం ఒక గేటును నిర్మించి, సెక్యూరిటీని నియమిస్తే మాకు ఇబ్బందులు ఉండవు.        
   - గరికన మస్సేను, మత్స్యకారుడు, విజయపురిసౌత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement