ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో ఒక మహిళ మృతి చెందింది.
వెల్దుర్తి (గుంటూరు జిల్లా) : ప్రేమ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన గురువారం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లె గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.... మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన గడిగండ్ల అయ్యన్న కుమార్తె, అదే గ్రామానికి చెందిన ఉడతల నర్సింహ ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరు పెద్దలకు తెలియకుండా గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
కాగా ఈ వ్యవహారంతో నర్సింహ చిన్నమ్మ మల్లీశ్వరి, అత్త ఎల్లమ్మ(25)కు సంబంధం ఉందని యువతి తండ్రి అయ్యన్న వర్గం భావించింది. దీంతో అయ్యన్న, అతని బావమరిది మాస్ ఇద్దరూ కలిసి నర్సింహ కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో ఎల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మల్లీశ్వరి తీవ్రంగా గాయపడింది. గాయపడిన మల్లీశ్వరిని మెరుగైన వైద్యం కోసం మాచర్ల ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఎల్లమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నర్సింహ.. అయ్యన్న కుమార్తెతో కలిసి పరారీలో ఉన్నట్లు సమాచారం. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.