
బీ‘టెక్కు’ డాక్టర్!
వారు చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగిలించుకున్నారు.
- కర్నూలు, ఆదోనిలలో నకిలీ ఆస్పత్రులు
- ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో రోగులకు చికిత్స
- విజిలెన్స్ విచారణలో వెల్లడి
కర్నూలు (హాస్పిటల్)/ఆదోని: వారు చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్. కానీ పేరు ముందు డాక్టర్ తగిలించుకున్నారు. పేరు చివరన ఎంబీబీఎస్‌తోపాటు స్పెషాలిటీ కోర్సులనూ జత చేశారు. అంతేనా.. కర్నూలు, ఆదోని పట్టణాల్లో దర్జాగా వైద్యం చేసేస్తున్నారు. వీరిచ్చే మామూళ్ల మత్తులో పడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రికి తాత్కాలిక అనుమతి కూడా ఇచ్చేశారు. అయితే తాజాగా ఆ ఆస్పత్రిని ఒక చోట నుంచి మరో చోటికి మార్పు చేయడంతో వారి బండారం బయటపడింది. విజిలెన్స్ అధికారులు రెక్కీ నిర్వహించి ఏక కాలంలో కర్నూలు, ఆదోనిలలోని ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలుకు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్రప్రసాద్ బీటెక్ చదివి గతంలో హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే నగదు చూసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కర్నూలులో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి తాను డాక్టర్ నాగేంద్రప్రసాద్ అని, ఇంటర్ చదివిని తన భార్య జ్యోతిని ఎంబీబీఎస్, డీసీహెచ్ అని పేర్కొన్నాడు. కర్నూలులో మరో చోట, ఆదోనిలో విజయగౌరి పేరుతో ఆస్పత్రులు ప్రారంభించాడు. ఒకదానిలో డిగ్రీ చదివిన తన బావమరిది రఘుని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్, ఎండీగా మార్చాడు. జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలతో కుమ్మక్కై, వారి ద్వారా తమ ఆస్పత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు. ఆర్‌ఎంపీ ఒక రోగిని వీరి ఆస్పత్రికి రిఫర్ చేస్తే 60% కమీషన్లు ముట్టచెప్పేవారు.
రెక్కీ నిర్వహించి విజిలెన్స్ దాడులు
ఈ ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం కర్నూలులో హోంగార్డులు శ్రీకాంత్, తిప్పయ్య విజయగౌరి హాస్పిటల్ కు వెళ్లారు. శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని.. రూ.150 కట్టి ఓపీ తీసుకు న్నాడు. నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్‌గా ఉందని చెప్పింది. శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు. కడుపునొప్పిగా ఉందనగానే స్కానింగ్‌తోపాటు రక్తపరీక్షలు చేయాలని చెప్పాడు. డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో మందులు రాసిచ్చి పంపించారు. అలాగే ఆదోనిలో డాక్టర్ నాగేంద్రప్రసాద్ వద్దకు హోంగార్డు నాగరాజు వెళ్లాడు. కళ్లు తిరుగుతున్నాయి, కడుపునొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు. హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో దాడులు చేపట్టి ఆస్పత్రులను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
వేటికీ అనుమతులు లేవు
కర్నూలు, ఆదోనిలోని ఆస్పత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప ఎలాంటి అనుమతులూ లేవు. అయినా అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్‌తోపాటు ఎక్స్‌రే, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. రోగులకు అన్ని పరీక్షలు చేసినట్లు నివేదికలు ఇచ్చి నొప్పి నివారణ మందులు, యాంటీబయాటిక్స్, విటమిన్స్ మందులు ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై.నరసింహులు విచారణలో తేలింది.