సెంటర్‌ ఎటెట్టా

Exam Centre Is Not In Own District - Sakshi

ఇబ్బందులు పడుతున్న టెట్‌ అభ్యర్థులు

తక్కువ సంఖ్యలో పరీక్షా కేంద్రాలు

ఇతర జిల్లాలకు వెళ్లి రాయాల్సిందే

కేంద్రాల మార్పునకు నో ఛాన్స్‌

వేల మందికి ఇతర జిల్లాలో పరీక్షా కేంద్రాలు     

సాక్షి, బద్వేలు : టెట్‌ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పరీక్షా కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థులకు శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. జిల్లాలోని అభ్యర్థులకు సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు మూడు వేల మంది  ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన ఆగత్యం ఏర్పడింది. 
ఈ నెల 10 నుంచి 19 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ...
జిల్లావ్యాప్తంగా 25 వేల మంది  టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొదట దరఖాస్తు అనంతరం గత నెల 25 నుంచి 29 వరకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి రోజు మధ్యాహ్నం లోపే డీఎడ్‌ అభ్యర్థులకు జిల్లాలో కేటాయిం చిన పరీక్షా కేంద్రాలన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికి మిగిలిన స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను తప్పని సరి పరిస్థితుల్లో ఇతర జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశించినా వారి  ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు.

 
గతంలో మాదిరే...
టెట్‌–2017లో దరఖాస్తు చేసుకున్న వారికి  పరీక్షా కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం చుక్కలు చూపింది. వారు కోరుకున్న కేంద్రాలను ఇవ్వకుండా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుత టెట్‌లో అలాంటి పరిస్థితి రాదని చెప్పిన అధికారులు తీరా దగ్గరికి వచ్చేసరికి చెతులేత్తాశారు. మరోసారి అలాంటి పరిస్థితే కల్పించి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారు.

జిల్లాలో పది కేంద్రాలే...
జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాలలో పది కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 29వ తేదీ తరువాత పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశిం చినా మీడియం, సబ్జెక్టు మార్పునకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో అభ్యర్థులు తీవ్రనిరాశకు గురవుతున్నారు.
∙పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపరు–1 ఎస్జీటీకి 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పేపరు–2కు ఎనిమిది వేల మంది, భాష పండిత పరీక్షకు మూడు వేల మంది, పీఈటీకి 1500 మంది  దరఖాస్తు చేసుకున్నారు. వీరు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడు చేసుకోవచ్చు.

ఆందోళనలో గర్భిణులు, దివ్యాంగులు..
టెట్‌ దరఖాస్తు చేసుకున్న వారిలో గర్భిణులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కేంద్రాలు ఆన్‌లైన్‌లో మొదటి రోజే పూర్తి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. రెండో రోజు నుంచి చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాలలోని కేంద్రాలు మాత్రమే కనిపించాయి. తరువాతైనా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఎలా అని గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.

ఇతర జిల్లాలకు వెళ్లాలంటే  రూ.వేలలో ఖర్చు
ప్రస్తుతం ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలంటే  రూ.వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. కేటాయించిన కేంద్రాలు కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముందురోజే వెళ్లాలి. బస్సుచార్జీలకు కనీసం రూ.వెయ్యి వెచ్చించాల్సిందే. అక్కడ వసతి, భోజనాలు, ఆటో ఖర్చులకు మరో రూ.వెయ్యికి పైగా కావాలి. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులకు మరోకరు తోడు ఉండాలి. వీరికి కనీసం రూ.5 వేలు కావాల్సిన పరిస్థితి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top