ఆదిలోనే సుస్తీ | Employees Health Scheme | Sakshi
Sakshi News home page

ఆదిలోనే సుస్తీ

Dec 18 2014 1:38 AM | Updated on Sep 2 2017 6:20 PM

ఆదిలోనే సుస్తీ

ఆదిలోనే సుస్తీ

జిల్లాలో ఎన్టీఆర్ ఆరోగ్యసేవ (రాజీవ్ ఆరోగ్యశ్రీ)లో ఎంప్లాయీస్‌హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) అమలుకు ఆరంభంలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.

ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు
ముందుకు రాని ఆస్పత్రులు
ఆరోగ్యశ్రీ నిధులు నిలిపివేసిన సర్కార్

 
విశాఖపట్నం: జిల్లాలో ఎన్టీఆర్ ఆరోగ్యసేవ (రాజీవ్ ఆరోగ్యశ్రీ)లో ఎంప్లాయీస్‌హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) అమలుకు ఆరంభంలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీని అమలుకు కొన్ని ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి. పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇలాం టి ఆస్పత్రులకు ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పరిధిలో రాష్ర్ట వ్యాప్తంగా 490 నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. వీటిలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రూ.2.50 లక్షల విలువైన వైద్యసేవలు అందేవి. ఉద్యోగులకు కూడా ఈనెల 6వ తేదీ నుంచి ఈ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వ్యయపరిమితి లేకుండా వైద్యసేవలు ఉచి తంగా పొందేందుకు వీలు కల్పించారు. ఇందుకోసం జిల్లాకో ప్రభుత్వాస్పత్రి చొప్పున ఎంపిక చేశారు. కేజీహెచ్‌తో సహా ఎంపికైన ప్రతీ ప్రభుత్వాస్పత్రిలో ఏసీ రూములు, ఇతర అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో సంబంధిత నెట్‌వర్క్ ఆస్పత్రులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా మరో 24 నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎంవోయూ చేసుకోలేదు. ఇందులో 13 ఆస్పత్రులు విశాఖపట్నంలోనే ఉన్నాయి.

ఈహెచ్‌ఎస్ ఒప్పందం  చేసుకోని ఈ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధుల విడుదలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి ఒప్పించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. డీఎంహెచ్‌వో, కలెక్టర్లు ఈ వారంలో ఈ నెట్‌వర్క్‌ఆస్పత్రులో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందం చేసుకొని ఆస్పత్రులతో ఎంవోయూ చేయించే విధంగా ఒప్పించనున్నారు. ఒక వేళ ముందుకు రాకుంటే వాటిని ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. ఈహెచ్‌ఎస్ అమలు విషయంలో కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అమలు చేస్తున్న మార్గదర్శకాలనే ఈహెచ్‌ఎస్‌కు కూడా అమలు చేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆది నుంచి డిమాండ్ చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో  విశాఖ జిల్లాలో రూ.3.18కోట్ల విలువైన 1,23,994 శస్త్రచికిత్సలు నిర్వహించగా, ఇప్పటి వరకు రూ.2.5కోట్లు మాత్రమే  విడుదల చేశారు.

జిల్లాలో 29 నెట్‌వర్క్ ఆస్పత్రులుండగా, వీటిలో కేజీహెచ్‌తో సహా ఎనిమిది ప్రభుత్వాస్పత్రులున్నాయి. మిగిలిన 21 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 8 ఆస్పత్రులు ఈహెచ్‌ఎస్‌అమలుకు ముందుకు రాగా మిగిలినవి ససేమిరా అంటున్నాయి. ఈ నెల 6 నుంచి ఈహెచ్‌ఎస్ అమలులోకి వచ్చినప్పటికీ ఎంవోయూకు ముందుకురాని ఈ ఆస్పత్రులకు అదే రోజు నుంచి ఆరోగ్యశ్రీ నిధుల విడుదలను నిలిపివేశారు. ఈ ఆస్పత్రులకు సరైన మార్గదర్శకాలు పాటించకపోవడంతో పాటు ఇతర కారణాలున్నప్పటికీ ఎంవోయూ చేసుకోకపోవడమే ప్రధాన అడ్డంకి అని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement