జన్మభూమి నిధులకు గ్రహణం | eclipse of Janmabhoomi funds | Sakshi
Sakshi News home page

జన్మభూమి నిధులకు గ్రహణం

Nov 7 2014 4:51 AM | Updated on Sep 2 2017 3:59 PM

జన్మభూమి నిధులకు గ్రహణం

జన్మభూమి నిధులకు గ్రహణం

దేవుడు వరమిచ్చినా...పూజరి కనికరించడనే చందంగా జన్మభూమి నిధుల మంజూరు వ్యవహారం తయారయింది.

మచిలీపట్నం : దేవుడు వరమిచ్చినా...పూజరి కనికరించడనే చందంగా జన్మభూమి నిధుల మంజూరు వ్యవహారం తయారయింది. జన్మభూమి సభల్లో షామియానా, కుర్చీలు, మైక్, తాగునీటి వసతి, వేదిక ఏర్పాటు, భోజనాల ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్కొక్క పంచాయతీకి రూ. 5వేలు, వార్డుకు రూ. 5వేలు చొప్పున విడుదల చేసింది. ఈ నిధులను అన్ని మండలాలకు, వార్డులకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం నుంచి విడుదల చేశారు. దీంతో పాటు జిల్లాలోని 49 మండలాలకు జన్మభూమి ఖర్చులుగా మరో రూ. 63వేలను అదనంగా మంజూరు చేశారు.
 
జిల్లాలో 1147 జన్మభూమి సభలను నిర్వహించాల్సి ఉండగా ఈ నెల 5వ తేదీ నాటికి 1016 జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 11వ తేదీతో జన్మభూమి కార్యక్రమం ముగియనుంది. జన్మభూమి కార్యక్రమం పూర్తయ్యే దశలో ఉన్నా ఆయా మండలాల్లోని పంచాయతీలకు ఖర్చుల నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎంపీడీవోలు పంచాయతీలకు ఇవ్వకుండా తొక్కిపెట్టడం పలు విమర్శలకు తావిస్తోంది.
 
ఖర్చులన్నీ కార్యదర్శులపైనే...
జన్మభూమి - మా ఊరు కార్యక్రమం  పంచాయతీ కార్యదర్శులకు పెనుభారంగా మారిం ది. ఏ పంచాయతీలో సభ జరిగితే సంబంధిత కార్యదర్శి వసతులు సమకూర్చాలని చెప్పడమే తప్ప దీనికి సంబంధించిన నిధులను మాత్ర ఎంపీడీవోలు ఇవ్వడం లేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు, ఈవోలు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఇవ్వకుండా ఎంపీడీవోలు తమపై పెత్తనం చెలాయిస్తుండడంతో సొంత ఖర్చులతోనే ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శికి రెండు నుంచి మూడు పంచాయతీలకు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఉండడంతో రెండు, మూడు చోట్ల ఈ ఖర్చులను భరించాలంటే ఒక్కొక్కసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని  చెబుతున్నారు.

జన్మభూమి కార్యక్రమానికి వచ్చే అధికారులు, ఇతర సిబ్బంది, పంచాయతీ పెద్దలు మొత్తం కలిపి 100 మంది అవుతున్నారని, వీరందరికీ భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు సభ నిర్వహణ ఏర్పాట్లు తామే చూసుకోవాల్సి రావడంతో ఖర్చు తడిచి మోపెడవుతోందని ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు తమకు అందజేస్తే కొంత వెసులుబాటు లభిస్తుందని పలువురు కార్యదర్శులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆయా పంచాయతీలకు విడుదలైన జన్మభూమి ఖర్చుకు సంబంధించిన సొమ్మును ఇప్పించాలని  విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement