నకిలీ దందా | Duplicate business | Sakshi
Sakshi News home page

నకిలీ దందా

Feb 21 2014 3:56 AM | Updated on Sep 2 2017 3:55 AM

జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి సులభంగా రవాణా చేస్తున్న ముఠాలు తమ నెట్‌వర్క్‌ను జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట నకలీ కరెన్సీ బయటపడడం కలకలం సృష్టిస్తోంది.

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి సులభంగా రవాణా చేస్తున్న ముఠాలు తమ నెట్‌వర్క్‌ను జిల్లా అంతటా విస్తరిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట నకలీ కరెన్సీ బయటపడడం కలకలం సృష్టిస్తోంది. పెద్దనోటు చూశామంటే అది నకిలీదా? అసలుదా? అని అనుమానపడే పరిస్థితి దాపురించింది. ఎన్నికల సీజన్ వస్తుండడంతో భారీగా నకిలీ కరెన్సీ జిల్లాకు వస్తోంది.
 
 జిల్లాలో నకిలీ కరెన్సీ చెలామణి జోరుగా సాగుతోం ది. పదేళ్లుగా జిల్లాలో అడపాదడపా నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకొచ్చినా రెండేళ్ల క్రితం చొప్పదండి మండలకేంద్రంగా నకిలీ కరెన్సీ వ్యవహారంలో ఓ హత్య జరగడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అప్పటికే పలుమార్లు నోట్లు మార్పిడీ చేశామని నిందితులు వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి తరచూ నకిలీ కరెన్సీ ముఠాలు ప ట్టుబడుతూనే ఉన్నాయి.
 
  ఈ ముఠాలు ఎక్కువగా గల్ఫ్ కు వెళ్లే సిరిసిల్ల, జగిత్యాల డివిజన్లపై దృష్టి సారిస్తున్నా యి. రైలు మార్గం ఉన్న మహారాష్ట్ర నుంచి, పశ్చిమబెం గాల్ కోల్‌కతా నుంచి ముఠాలు నకిలీ కరెన్సీని తీసుకువచ్చి ఇక్కడ సులభంగా మార్పిడి చేస్తున్నాయి. బ్యాం కులు, ఏటీఎంలలోనూ నకిలీ కరెన్సీ దర్శనమిస్తోందం టే ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్లిందో తెలుసుకోవచ్చు.
 రూ.30 వేల అసలు నోట్లు ఇస్తే రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇస్తున్నారని సమాచారం. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశతో కొందరు ఈ ముఠా వలలో చిక్కుతున్నారు. ముఠా సభ్యుల నుంచి నకిలీ కరెన్సీ పొందినవారు ఒకేసారి మొత్తంగా కాకుండా ఒక్కొక్కటిగా మార్పిడి చేస్తుండడంతో పెద్దగా బయటకు రావడం లేదు.
 
 వ్యాపార కేంద్రాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తోందని సమాచారం. భారీ మొత్తంలో నగదు కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిత్యం జరుగుతుండడం నకిలీ కరెన్సీ ముఠాకు కలిసొస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని నకిలీ కరెన్సీ ముఠాలు పోలీసులకు పట్టుబడడం... ఈ ప్రాంతంలోనే ఈ నోట్ల చెలామణి ఎక్కువగా జరుగుతోందని చెప్పడానికి నిదర్శనం. వీరిలో అనేకమంది పోలీసులు చిక్కి కూడా మళ్లీ అవే నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గోదావరిఖనిలో గురువారం పట్టుబడ్డ ముఠాసభ్యుడు సదానందం ఇప్పటికే మూడుసార్లు జిల్లా పోలీసులకు పట్టుబడడం గమనార్హం.
 
 ఎన్ని‘కలలు’
 త్వరలో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముఠాలు ముందస్తుగానే భారీగా నకిలీ కరెన్సీని జిల్లాకు తరలించి మారుమూల ప్రాంతాల్లో నిల్వ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తంలో పంపకాలు ఉండడం... ఓటర్లకు నేరుగా డబ్బులు ముట్టజెప్పే విధానానికి పాల్పడుతుండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడిచిపోయే అవకాశముందని ముఠాసభ్యులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
 కరువైన నిఘా
 జిల్లాలో నకిలీ కరెన్సీ బయల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా పోలీసుల నిఘా తక్కువగానే ఉండడంతో నోట్లు మార్పిడి చేసే ముఠాలు తమ పని సులభంగా చేసుకుపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం డమ్మీ నోట్ల మార్పిడి ముఠా సమాచారం చిక్కినా కూడా వారిని ఁమామూలు*గా వదిలేశారనే ఆరోపణలొచ్చాయి. గతంలో నక్సల్స్ ఏరివేతలో పేరుగాంచిన ఓ కానిస్టేబుల్ నకిలీ కరెన్సీ తయారీ ముఠాకు సహకరించి పోలీసులకు చిక్కిన సంఘటనలు జిల్లాలో జరిగాయి. ఇలాంటి ముఠాలను అరెస్టు చేసిన అనంతరం వాటి కదలికలపై నిఘా పెట్టకపోవడంతో వారే మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇలాంటి ముఠాలు సుమారు 8 వరకు ఉన్నాయని సమాచారం. ఒక్కో ముఠాలో ఇద్దరి నుంచి 8 మంది సభ్యులు ఉంటారని అంచనా. వీరు నిత్యం ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ కరెన్సీ మార్పిడి చేస్తుంటారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement