సమ్మె చీకట్లు | due to the strike powercuts are faceing problems very crucial | Sakshi
Sakshi News home page

సమ్మె చీకట్లు

Sep 13 2013 4:50 AM | Updated on Oct 20 2018 6:17 PM

విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు.

నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో గురువారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్ల ఫీడర్లల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఆయా విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 1950 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లల్లో ఫ్యూజులు పోయి పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీరు సరఫరా, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయి.
 
 నెల్లూరు రూరల్ మండల పరిధిలోని బుజబుజ నెల్లూరు, వెంకటాచలం మండలం, కాకుటూరు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకే సరఫరా నిలచిపోయింది. నెల్లూరు నగరంలోని నవాబుపేట ఫీడర్‌లో ఒక బిట్, టౌన్-2 ఫీడర్ పరిధిలోని పోలీసుకాలనీ, ప్రభుత్వాస్పత్రి ఎదురు ప్రాంతాలు, రాజరాజేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని అక్కంపేట, మాంబట్టు ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సరఫరా ఆగిపోయింది. గూడూరు డివిజన్ పరిధిలోని చాగణం, పోతేగుంట ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విడవలూరు మండలం ఊటుకూరు, గిద్దలూరు ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, ఉదయగిరి డివిజన్‌లోని గండిపాళెం ఫీడర్‌లో పూర్తిగా సరఫరా ఆగిపోయింది. వీటితో పాటు ఆత్మకూరు, రాపూరు, కావలి, వెంకటగిరి డివిజన్లలో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు సమాచారం.
 
 ఇబ్బందుల్లో ప్రజలు
 విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లలో ఫ్యూజులు మాత్రమే పోయినట్టు ఆశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జిల్లాలో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురికాలేదని చెబుతున్నారు. అయితే అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సిమ్ కార్డులను వెనక్కి ఇవ్వడంతో విద్యుత్ సమాచారంపై ఎవరికి ఫోన్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఒక్క రోజుకే జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా బంద్ కావడంతో రానున్న రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
 
 ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నాం
 విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం సరఫరా ఆగింది. ఆయా సబ్‌స్టేషన్‌లలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్నాం. సాధ్యమైనంత వరకు సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరిస్తున్నాం.  
  -నందకుమార్, ఎస్‌ఈ, ట్రాన్స్‌కో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement