శాసనసభలో ఎమ్మెల్యేల తొలి గళం ప్రజాపక్షం

District Legislators Who Explained The Problems Of The People Of Anantapur In The Assembly - Sakshi

ఈ నెల 11 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. 14 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు మంగళవారంతో ముగిసాయి. జిల్లా సమస్యలు, నియోజకవర్గ సమస్యలపై ప్రజా గొంతుకను జిల్లా మంత్రి శంకరనారాయణతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వినిపించారు. తమ ప్రాంతాల్లో ప్రధానంగా నెలకొన్న సమస్యలు ప్రస్తావించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన మంత్రితో పాటు  పుట్టపర్తి, కదిరి, రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు ‘అధ్యక్షా’ అంటూ తమదైన శైలిలో సమస్యలు ప్రస్తావిస్తూ సీనియర్లను సైతం మైమరిపించారు. తొలిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ సమస్యలపై మాట్లాడిన వారి తీరు ఆకట్టుకుంది.  కాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు మూడు రోజులు హాజరైనా మైకు మాత్రం పట్టుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యలు.. వారి మాటల్లోనే..             – అనంతపురం   

ఉద్యాన రైతులను ఆదుకోండి 
శింగనమల: నియోజకవర్గంలో పండ్ల తోటలు సాగు చేసే రైతులను ఆదుకోవాలంటూ శాసనసభ సాక్షిగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. మంగళవారం శాసనసభ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మిడ్‌ పెన్నార్‌ డ్యాం నుంచి నియోజకవర్గంలోని ఆయకట్టుకు నీటి కేటాయింపులున్నా.. కొన్నేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారన్నారు. అత్యధికంగా సాగవుతున్న చీనీ, జామ తోటలను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వదులుకుంటున్నారని గుర్తు చేశారు. బోర్లు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి.. చివరకు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటీవల గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో రైతు సుబ్బయ్య ఆత్మహత్య ఇలాంటిదేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉద్యాన పంటలను సాగు చేసే రైతులను ఆదుకోవాలని కోరారు.

ఉద్యావన పంటల సాగును గత ప్రభుత్వం పోత్సహించ లేదన్నారు.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004 నుంచి ఐదేళ్లు పండ్ల తోటల సాగుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఎంఐటీహెచ్‌ రాష్ట్ర ప్లాన్, ఆర్‌కేవీవై ప్లాన్‌ కింద 7,325 మంది లబ్ధిదారులను చేరుస్తూ రైతులకు రూ.16.68 కోట్లు ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ చొరవ వల్లనే అప్పట్లో అనంతపురానికి హార్టికల్చర్‌ జిల్లాగా పేరు వచ్చిందని తెలిపారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని కొనసాగించడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరచాయని విమర్శించారు. ఇలాంటి తరుణంలో జిల్లా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని సూచించారు.  

మంత్రి కన్నబాబు స్పందన..  
‘ఉద్యాన పంటలను పోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలో 38,573 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఎండిపోతున్న ఉద్యాన పంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు గత ప్రభుత్వం ట్యాంకర్‌కు రూ.500 ఇస్తే, మన ప్రభుత్వం రూ.600 చెల్లించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వర్షాలు సమృద్ధిగా కురిసే వరకూ చెల్లిస్తాం. ఎండిపోయిన చెట్లను తొలగించి,  తిరిగి పంటలను వేసుకునేందుకు ఉద్యాన శాఖ ద్వారా హెక్టారుకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తాం. చిరుధ్యానాల సాగును పోత్సహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం.’ అంటూ ఎమ్మెల్యే పద్మావతికి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమాధానమిచ్చారు.  

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ చారిత్రాత్మకం  
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన బిల్లులతో రాజారామ్మోహన్‌ రాయ్‌ లాంటి సంఘ సంస్కర్తగా కీర్తింపబడుతున్నారు. లాలించే స్థాయి నుంచి పాలించే స్థాయికి మహిళలకు ఎదగడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గొప్పవిషయం.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్న పథకాలు అమలు చేయడానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు కనిపించింది. రైతులను మహారాజులుగా చేయాలన్న సంకల్పంతోనే బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి.                    
– ఉషశ్రీచరణ్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే 

ఎన్టీఆర్‌ తర్వాత వైఎస్సే  
రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకున్న వారిలో ఎన్టీఆర్‌ తర్వాతి స్థానం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదే. ఎపీ భూభాగం నుంచే గోదావరి జలాలను శ్రీశైలం సాగర్‌కు మళ్లించాలి. మన భూభాగం నుంచే గోదావరి జలాలను మళ్లించి సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పారిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పొరుగు రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి మనకు వద్దు. భూ యాజమాన్య బిల్లును స్వాగతిస్తున్నాం. ఇదేమి కొత్త బిల్లు కాదు,  దేశ వ్యాప్తంగా భూ హక్కులపై ఉన్న సమస్యలను కేంద్రం కూడా గుర్తించింది.   
– పయ్యావుల కేశవ్, ఉరవకొండ ఎమ్మెల్యే   

వెనుకబడిన కులాల్లో వెలుగులు  
ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు లక్షలాదిమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమ ఇబ్బందులు ఏకరవు పెట్టారు.  ఆయా వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం మొత్తం ఐదు బిల్లులు ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. దేశంలోనే ఇది అరుదైన ఘట్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ, వారి సమస్యల పరిష్కారం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి తెలియజేస్తోంది. ఈ రోజు బీసీల అభ్యన్నతి కాంక్షిస్తూ శాశ్వత కమిషన్‌  ఏర్పాటుతో వారి కష్టాలు తొలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెనుకబడిన తరగతుల పురోభివృద్ధి, సాధికారత కోసం పటిష్టమైన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసింది.  2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి కులానికో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసగించారు. బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలనే దిగజారుడు ఆలోచన చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కుల వృత్తులే కాకుండా నామినేటడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం ఇస్తామంటూ గొప్ప నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  
– మాలగుండ్ల శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే  

ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనం 
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు తీసుకువస్తూనే మరోవైపు అవినీతి నిరోధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నూతన  బిల్లులు తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే లోకాయుక్త సవరణ బిల్లు, జుడీషియల్‌ బిల్లులు ప్రవేశపెట్టారు. లోకాయుక్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే హైకోర్టు జస్టిస్‌ను నియమించాల్సి ఉంది. దేశంలో న్యాయమూర్తుల కొరత ఉండడంతో సమస్యగా మారింది. దేశంలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులు అవసరముండగా కేవలం 534 మంది న్యాయమూర్తులు, 132 మంది అదనపు న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.  రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, 9 మంది అదనపు న్యాయ మూర్తులు అవసరముండగా 13 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు.   
– కాపురామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే 

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం  
వైఎస్‌ హయాంలో ఎంతోమంది పేదలు ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పొందారు. అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు హయాంలో నిర్వీర్యం చేశారు. పసికందును ఎలుక కొరికిందంటూ ఎలుకలు, బల్లులు పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా టెండర్లు పిలిచి పెద్ద మొత్తంలో ప్రజల సొమ్ము మింగేశారు. ఒక ఎలుకను పట్టుకుంటే రూ.10వేలు, బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు చొప్పున బిల్లులు  చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే రూ.45 లక్షలు బిల్లులు స్వాహా చేశారనే విషయాన్ని పత్రికల్లో చూశాం. ఆరోగ్యశ్రీ కోసం ప్రస్తుత ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.   వైద్య చికిత్సల బిల్లు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  
– డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, కదిరి ఎమ్మెల్యే  

రైతులు కూలీలుగా మారారు  
గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని  చిన్నచూపు చూశారు. ఫలితంగా ఆ రంగం కుదేలైంది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో రైతులు కూలీలుగా మారారు. టీడీపీ హయాంలో 1,160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి రైతు భరోసా యాత్రతో అండగా నిలిచారు.  పంటలకు వాతావరణ బీమాతో నష్టం కలుగుతోందని, ఏదో ఒకటి రెండు చోట్ల కురిసిన వర్షం ఆధారంగా బీమాను ఇవ్వడం వల్ల రైతులందరికీ నష్టం జరుగుతోంది.  ధర్మవరం నియోజకవర్గంలో రైతులు రూ. 500 ప్రీమియం చెల్లిస్తే కేవలం రూ.300 బీమా దక్కిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.  
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే 

హంద్రీ–నీవా పనులు వెంటనే పూర్తి చేయాలి  
వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు మడకశిర నియోజకవర్గంలోని కరువు పరిస్థితులు, రైతుల కష్టాలను గుర్తించి హంద్రీనీవా ద్వారా సాగు నీరు అందించడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ను ప్రత్యేకంగా మంజూరు చేశారు. దీనిద్వారా నియోజకవర్గంలోని 168 చెరువులకు సాగునీరు అందించడానికి వీలుగా ప్రణాళిక రూపొందించి పనుల కోసం రూ.కోట్ల నిధులను మంజూరు చేశారు.  మడకశిర ప్రాంతానికే కాకుండా హిందూపురంలో 48 చెరువులు, పెనుకొండ నియోజకవర్గంలోని 31 చెరువులకు సాగునీరు అందించడానికి చర్యలు చేపట్టారు. వైఎస్‌ హయాంలో  80 శాతం పూర్తి చేశారు. ఆయన అకాల మరణంతో  పనులు ఆగి పోయాయి. ఈ పనులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.  వెంటనే పనులను పూర్తి చేసి మడకశిర ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా సాగునీటిని అందించేలా చూడాలి.  
 – డాక్టర్‌ తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే 

రూ. కోట్లు దోచిపెట్టారు  
మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విద్యుత్‌ ఛార్జీలు పెంపును నిరసిస్తూ ధర్నా చేసిన రైతులను లాఠీలతో కొట్టించి కాల్పులు జరిపారు.  ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుండి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కోలను నాశనం చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి మిగులు విద్యుత్తు సాధిస్తే ఆ ఘనత తనదని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. రీనవబుల్‌ ఎనర్జీ ఆబ్లిగేషన్లకు మించి  సోలార్, విండ్‌ ఎనర్జీలను కేవలం 6 కంపెనీలతో కొనుగోలు చేసి రూ.3 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. రాష్ట్రంలో మిగులు ఉత్పత్తి ఉన్నా సోలార్, విండ్‌ ఎనర్జీలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.  
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే 

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీయాలి  
సాగునీటి ప్రాజెక్టులలో అంచనాలు పెంచుకొని టీడీపీ పాలకులు చేసిన దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలి. అనంతపురం జిల్లాలో చేపట్టిన హంద్రీ–నీవా కాలువ పనులతో పాటు చాలా ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం బినామీలకు అప్పగించింది. నిర్మాణపు అంచనాలు పెంచుకొని నిధుల దోచేశారు. అప్పటి మంత్రి పరిటాల సునీత, ఇతర ఎమ్మెల్యేల అండతో కోట్లాది రూపాయలు  ప్రజాసొమ్మును స్వాహా చేశారు.  విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రాప్తాడు నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకొనేందుకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసే సాగునీటి రిజర్వాయర్లతో పాటు ప్రజల తాగునీటి సమస్యలను తీర్చేందుకు నిధులు కేటాయించాలి.   – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే 

భూ యాజమాన్య చట్టంతో హక్కుదారులకు భద్రత  
ఏపీ భూ యాజమాన్య చట్టం ద్వారా భూ యజమానికి భద్రతతో పాటు హక్కులు లభిస్తాయి. ల్యాండ్‌ మాఫియా ఆగడాలు, భూ కబ్జాలు జరగవు. భూ వివాదాలు, నేరాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ బిల్లు వల్ల భూ యజమానులకు మేలు జరుగుతుంది.  అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో 30 వేల ఎకరాలకు పైగా భూమిని మాజీ సీఎం చంద్రబాబు లాక్కొని అన్నదాతల నోట మట్టి  మట్టికొట్టారు. టీడీపీ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోయింది. ల్యాండ్‌ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనే సదుద్దేశంతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇది శుభపరిణామం. ఈ చట్టం అమలులోకి వస్తే ప్రతి ఒక్కరికీ వారి భూమిపై పూర్తి హక్కు లభిస్తుంది. ఒక్కసారి భూరికార్డులో యజమానిగా నమోదైతే రికార్డులో పొరపాట్ల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వమే పరిహారం కూడా చెల్లించేలా చట్టాన్ని రూపొందించడం గర్వకారణం. భూవివాదాల పరిష్కారానికి దోహదపడే ఈ చట్టానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు  తెలుపుతున్నా.   – వై.వెంకటరామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top