వికేంద్రీకరణే ఉత్తమం

Dharmana Prasada Rao Fires On Chandrababu In Assembly  - Sakshi

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిపై చంద్రబాబు ఆలోచించలేదు

అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించారు

రాజధానిపై అఖిలపక్షాలతో ఆయన అస్సలు సంప్రదించలేదు

శివరామకృష్ణన్‌ సిఫార్సులనూ పట్టించుకోలేదు

దేశంలో ఎక్కడాలేని విధంగా 8,603 చ.కి.మీ. భూమిని సమీకరిస్తారా?

2 లక్షల మంది శ్రీకాకుళం జిల్లా వలస కూలీల దీనస్థితినీ గుర్తించలేదు

అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు ధ్వజం

రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించేలా చూశారని.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేయతలపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వం ప్రజల్ని దగా చేసిందని ఆరోపించారు. రాజధాని అంశంపై శాసనసభలో మంగళవారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్షాలతో కనీసం సంప్రదించకుండా రాజధానిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విరుచుకుపడ్డారు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడంవల్ల రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని ఆయన గుర్తుచేశారు.

కానీ.. చంద్రబాబు అదేమీ పట్టించుకోకుండా అమరావతిపైనే దృష్టిపెట్టారన్నారు. అంతేకాక.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి గురించి కూడా ఏమాత్రం ఆలోచించలేదన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన 23 ఉన్నత సంస్థల్లో ఒక్కటైనా సరే శ్రీకాకుళం జిల్లాకు ఎందుకు కేటాయించలేదని చంద్రబాబును ధర్మాన నిలదీశారు. దాదాపు 2 లక్షల మంది శ్రీకాకుళం జిల్లా వాసులు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకులు వెళ్లదీస్తున్న దీనస్థితిని ఆయన ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.

శివరామకృష్ణన్‌ సిఫార్సులు పట్టించుకోలేదు
కాగా, సాగు భూములకు భంగం కలిగించవద్దని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, అభివృద్ధిని కేంద్రీకరించవద్దని, ప్రకృతి వైపరీత్యాల ముప్పును పరిగణనలోకి తీసుకోవాలని, నిర్మాణ వ్యయం కనీస స్థాయిలో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సు చేసిందని ధర్మాన గుర్తుచేశారు. కానీ, వాటిలో ఏ ఒక్కటీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు రాజధానిని నిర్ణయించారని తీవ్రంగా మండిపడ్డారు.

లోక కల్యాణమా.. లోకేశ్‌ కల్యాణమా..
సింగపూర్‌ కంపెనీతో ఏకపక్షంగా ఒప్పందం కుదుర్చుకుని వారికి రూ.16వేల కోట్ల విలువైన 1,600 ఎకరాల భూమి ఇచ్చేందుకు అంగీకరించడం కంటే బరితెగింపు మరొకటి ఉంటుందా అని ధర్మాన ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో నిర్మించిన రాజధానులన్నీ కూడా 115 చదరపు.కి.మీ. నుంచి 425 చ.కి.మీ. పరిధిలోనే ఉంటే.. చంద్రబాబు మాత్రం ఏకంగా 8,603 చ.కి.మీ. మేర భూమిని సమీకరించడం ఏమిటన్నారు. సీఆర్‌డీఏకు చంద్రబాబు చైర్మన్‌గా ఉంటూ చేసిన నిర్ణయాలను ఆయన అధ్యక్షతన జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆమోదించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదంతా లోక కల్యాణం కోసమా లేక లోకేశ్‌ కల్యాణం కోసమా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అమరావతి పేరుతో జరిగిన దోపిడీకి తెరదించి అభివృద్ధిని రాష్ట్రమంతటా వికేంద్రీకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ను ధర్మాన కోరారు. కాగా, సీఎంగా వైఎస్‌ జగన్‌ తొలిసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చి కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి ఓ భారీ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమని ధర్మాన కొనియాడారు.

ధర్మాన సంధించిన ప్రశ్నలు..
►వేలకు వేల ఎకరాలు తీసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా?
►ఎన్ని సంవత్సరాలకు ప్రణాళిక వేశారు.. 53 వేల ఎకరాల్లో మీరు తాపత్రయపడి ఖర్చుపెట్టింది ఎంత.. ఐదు వేల కోట్లు.. ఏమిటిది?
►ఐదేళ్లలో ఐదు వేల కోట్లే పెట్టారంటే.. మీరు చూపించిన రాజధానిని ఎన్ని సంవత్సరాల్లో కడతారు?
►ఆచరణలో సాధ్యం కాని అంశాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇది కాదని మీరు చెప్పగలారా?
►ఇక్కడ రాజధానికే డబ్బంతా పెట్టేస్తే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ విషయం ఆలోచించలేదా?
►అమరావతినే అభివృద్ధి చేసి, దాని ద్వారా ప్రయోజనం పొందాలనేది తప్ప ఏముంది ఇందులో?
►రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలి. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని మీకు తెలియదా?
►అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయి. రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి కనీస అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు?
►రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా ఎందుకు ఆగలేకపోయారు?
►రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 10 ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని ఆ కమిటీకి చెప్పి ఎందుకు సహాయ నిరాకరణ చేశారు?
►ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ఉంటే.. విభజన జరిగినా మనకు ఆవేదన ఉండేది కాదు. కానీ అలా ఎందుకు జరగలేదు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top