వయా తెలంగాణ

Crossing Telangana State For Mandal Office in East Godavari - Sakshi

మండల కేంద్రం వెళ్లాలంటే ఆ రాష్ట్రం దాటాల్సిందే..

టీడీపీ పాలకుల తీరుతో నాలుగేళ్లుగా అవస్థలు

నెల్లిపాకను కేంద్రంగా చేయాలని డిమాండ్‌

తోటపల్లి అందరికీ సౌలభ్యమనే మరో వాదన తెరపైకి..

రాష్ట్ర విభజనతో తలెత్తిన ఇబ్బందులు ఎటపాక మండలవాసులను వెన్నాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మండల కేంద్రం వెళ్లేందుకు వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా మండల కేంద్రం ఎటపాక తెలంగాణలో ఉంది. ఈ మండల కేంద్రాన్ని మార్చాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.

నెల్లిపాక (రంపచోడవరం): రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం మండలంలోని 21 గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలతో కలిసి మొత్తం 70 గ్రామ రెవెన్యూలు ఈ మండలంలో ఉన్నాయి. ఈమండలంలో సుమారు 40వేల మంది జనాభా ఉన్నారు. వీరికి తొలుత నెల్లిపాక మండల కేంద్రంగా ప్రకటిస్తూ జీఓ జారీ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ కొద్దిరోజుల్లోనే మండల కేంద్రాన్ని ఎటపాకను చేస్తూ ప్రభుత్వం మరో జీఓ జారీ చేసింది. అప్పటి నుంచి ఈ మండల ప్రజలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. 

ఎటపాక మండల కేంద్రాన్ని వెళ్లిరావడం దూరాభారం కావడంతో నానా అవస్థలు పడుతున్నారు. నాటి టీడీపీ పాలకుల నిర్ణయమే తమను ఇబ్బందులు పాల్జేసిందని మండల ప్రజలు చెబుతున్నారు.  మండల కేంద్రం ఎటపాక వెళ్లాలంటే సరిహద్దున ఉన్న తెలంగాణ పట్టణం దాటి మరో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. మారుమూల గ్రామస్తులు మండల కేంద్రం వెళ్లాలంటే 35 కిలోమీటర్లు పైబడి ప్రయాణించాల్సి వస్తోంది. ఎటపాకలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి కాలినడకన వెళ్లాలి. అక్కడ గొంతు తడుపుకునేందుకు నీరు కూడా దొరకడం లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పలుమార్లు ఎటపాక వెళ్లి రాలేక నిరుపేదలు నీరుగారిపోతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు వందల సంఖ్యలో  పలు సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీ నాయకుల స్వార్ధప్రయోజనాలకోసం ఎటపాకను మండల కేంద్రంగా చేయించారని విమర్శిస్తున్నారు.

మండల కేంద్రం మార్పునకుపెరుగుతున్న డిమాండ్‌
మండలానికి మధ్యలో ఉండే నెల్లిపాక పంచాయతీ చుట్టూ 18 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందని మండలవాసులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఎటపాక మండలంలోని తోటపల్లిలో వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, బ్యాంకులు, హోటళ్లు, పరిసరాల్లో పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలు ఉండటంతో మండల కార్యాలయాలు తోటపల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.  గడిచిన నాలుగేళ్లలో అవినీతి, భూదందాలు, కమీషన్లు, నిర్లక్ష్య పాలనకు నిదర్శనంగా నిలిచిన ఎటపాక మండల కేంద్రాన్ని మార్చాలనే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఈ మండల కేంద్రం మార్పుపై తగు నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొత్త ప్రభుత్వంతగు నిర్ణయం తీసుకోవాలి
నూతనంగా ఏర్పాటైన జగనన్న ప్రభుత్వం ప్రజల అభీష్టంమేరకు ఎటపాక మండలం కేంద్రం మార్పుపై తగునిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వ నూతన కార్యాలయ భవనాలు అనువైన ప్రాంతంలో నిర్మించాలి.–తానికొండ వాసు, నందిగామ

ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు
మండల కేంద్రం ఎటపాక వెళ్లివచ్చేందుకు సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలి.–దుద్దుకూరి హరనాథబాబు, తోటపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top