హుస్నాబాద్‌లో కిరాయి గూండాలు పెట్రేగిపోతున్నారు. వారి ఆగడాలు మితిమీరుతున్నా అదుపు చేసే వారే కరువయ్యారు. గురువారం రాత్రి సీపీఐ కార్యకర్త రాగుల శ్రీనివాస్‌పై ఇదే గూండాలు హత్యాయత్నం చేశారు.
హుస్నాబాద్‌రూరల్,న్యూస్‌లైన్: హుస్నాబాద్‌లో కిరాయి గూండాలు పెట్రేగిపోతున్నారు. వారి ఆగడాలు మితిమీరుతున్నా అదుపు చేసే వారే కరువయ్యారు. గురువారం రాత్రి సీపీఐ కార్యకర్త రాగుల శ్రీనివాస్‌పై ఇదే గూండాలు హత్యాయత్నం చేశారు. శ్రీనివాస్‌కు తన బంధువు ఒకరితో భూ సంబంధమైన గొడవ జరిగింది.
ఇద్దరూ వాదులాడుకోవడంతో స్థానికులు వారించారు. అయితే కొద్దిసేపటికే శ్రీనివాస్ బంధువు కిరాయి గూండాలతో వచ్చి శ్రీనివాస్‌వాస్‌పై దాడి చేయించాడని ఆయన బంధువులు తెలిపారు. కర్రలతో తలపై తీవ్రంగా కొట్టడంతో కుప్పకూలిపోయిన శ్రీనివాస్‌ను హుస్నాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కరీంనగర్‌కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడవెంకట్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు పరామర్శించారు.
ఈ సంఘటనపై పోలీసుల నుంచి వివరాలు రావాల్సి ఉంది. కొన్నేళ్ల క్రితం పట్టణంలోని ఎల్లంబజార్‌లో కూడా ఈ తరహా గూండాలు జనం చూస్తుండగానే ఓ యువకుడి గొంతు కోసి చంపారు. మరో యువకుడిని దారుణంగా కొట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు. ప్రధాన కూడళ్లలో, మద్యం దుకాణాల ముందు వీరంగం సృష్టిస్తూ రోజుకొక గొడవకు కారణమవుతున్న ఈ గూండాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.