అంతా హడావుడే! | Sakshi
Sakshi News home page

అంతా హడావుడే!

Published Tue, Aug 14 2018 7:00 AM

Corruption In Kurnool Zilla Parishad - Sakshi

కర్నూలు(అర్బన్‌): పనులు పూర్తి కాకుండానే నూతన భవనం నుంచి జిల్లా పరిషత్‌ పాలన ప్రారంభమైంది. చైర్మన్‌ మెప్పు పొందేందుకు ఓ అధికారి చేసిన హడావుడి కారణంగా అధికారులు, సిబ్బంది అవస్థ పడాల్సి వచ్చింది. రూ.3.67 కోట్లతో జెడ్పీ నూతన భవనం నిర్మించారు. దీన్ని గత నెల తొమ్మిదిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌  ప్రారంభించారు. అయితే.. ఈ భవనంలో అధికారులు, ఉద్యోగులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నీచర్, పాలన నిర్వహణకు తగినన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కంప్యూటర్ల నిర్వహణకు సంబంధించి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు కూడా ఇంకా తీసుకోలేదు.

జెడ్పీ చైర్మన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఏఓ చాంబర్లతో పాటు సందర్శకుల గదిలో ఫ్యాన్లు, ఏసీలు బిగించలేదు. సందర్శకులు కూర్చుకునేందుకు అవసరమైన కుర్చీలు లేవు. ఈ భవనంలోనే మినీ మీటింగ్‌ హాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క కుర్చీ కూడా లేదు. భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉంది. మొత్తమ్మీద దాదాపు 40 శాతం పనులు పెండింగ్‌లో ఉండగానే సోమవారం నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఈ నెల 13 (సోమవారం) జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ పుట్టినరోజు కావడంతో  ఓ అధికారి ఆయన మెప్పు పొందేందుకు  ఇదే రోజు నూతన భవనంలోకి మారాలని పట్టుబట్టి సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టించినట్లు విమర్శలొస్తున్నాయి.

 సొంత ఖర్చుతో సరంజామా తరలింపు 
పాత భవనంలోని కంప్యూటర్లు, బీరువాలు, ఫైళ్లు, ఫర్నీచర్‌ను నూతన భవనంలోకి తరలించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాల్సి ఉంది. అయితే.. ఎలాంటి బడ్జెట్‌ కేటాయించకపోగా, కచ్చితంగా 13వ తేదీన నూతన భవనంలోకి షిఫ్ట్‌ కావాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత సెక్షన్లకు చెందిన ఉద్యోగులు  రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాల్లో కూడా పనిచేశారు. తమ సొంత ఖర్చులతో ఫర్నీచర్, బీరువాలు, ఫైళ్లను నూతన భవనంలోకి మార్చుకున్నట్లు తెలుస్తోంది.

 
పాలనకు వారం రోజుల విరామం! 

నూతన భవనంలో ఇంకా బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు తీసుకోకపోవడం, కంప్యూటర్లు అమర్చకపోవడం వల్ల మరో వారం రోజుల వరకు జెడ్పీ పాలనకు అనధికార విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎఫ్, ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌంట్స్‌ తదితర విభాగాల్లో విద్యుత్, ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పాలన అంతా ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే సాగుతున్న నేపథ్యంలో నూతన భవనం నుంచి జెడ్పీ పాలన సజావుగా సాగేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెడ్పీలో అన్ని సెక్షన్లలో 72 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు వెచ్చిస్తే తప్ప పూర్తి స్థాయిలో వసతులు కల్పించలేమనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.  

ఫర్నీచర్‌ వచ్చేస్తోంది  
ఫర్నీచర్‌ రెండు రోజుల్లో వచ్చేస్తుంది. ప్రస్తుతం పలు విభాగాల్లో విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన కంప్యూటర్ల కొనుగోలకు చర్యలు చేపట్టాం.   – ఎం.విశ్వేశ్వరనాయుడు, జిల్లా పరిషత్‌ సీఈఓ

 

1/1

ఓ సెక్షన్‌లో కుర్చీలు, కంప్యూటర్లు లేని దృశ్యం

Advertisement
Advertisement