దండుకుంటున్న ‘పచ్చ’దండు | Corruption In Rajeev Vidhya Mission Schools tdp leaders | Sakshi
Sakshi News home page

దండుకుంటున్న ‘పచ్చ’దండు

Sep 15 2014 1:21 AM | Updated on Aug 10 2018 9:40 PM

దండుకుంటున్న ‘పచ్చ’దండు - Sakshi

దండుకుంటున్న ‘పచ్చ’దండు

అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న సర్వశిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులకు ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు తోడయ్యారు. అదనపు తరగతి గుదల నిర్మాణాన్ని అడ్డదారుల్లో చేజిక్కించుకుంటున్న

సాక్షి, కాకినాడ :అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్న సర్వశిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులకు ఇప్పుడు తెలుగుతమ్ముళ్లు తోడయ్యారు. అదనపు తరగతి గుదల నిర్మాణాన్ని అడ్డదారుల్లో చేజిక్కించుకుంటున్న ‘పచ్చ’ దళం పని ప్రారంభించకుండానే పర్సంటేజ్‌లు పంచుకుతినడంతో జిల్లాలో ఇప్పటికే ఆరు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది.రాజీవ్ విద్యామిషన్ ద్వారా 2014-15లో జిల్లాలో 927 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని తొలుత ప్రతిపాదించగా, మరో 184 గదులు నిర్మించాలని తర్వాత ప్రతిపాదించారు. ఒక్కో గదికి రూ.4.85 లక్షల అంచనా వ్యయంతో కలెక్టర్ పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చారు.
 
 రూ.53.88 కోట్లతో 1,111 తరగతిగదులు నిర్మించాలని సంకల్పించారు. సాధారణంగా ఈ పనులన్నీ  స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలోనే జరగాలి. కమిటీ చైర్మన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఉమ్మడి ఖాతాలో జమయ్యే ఈ నిధులను కమిటీ పర్యవేక్షణలో ఖర్చు చేయాలి. సాధారణంగా మంజూరైన మొత్తంలో 70 శాతం ముందుగానే వీరి ఖాతాకు జమవుతాయి. నిర్మాణ సామగ్రికి చెక్కులుగా, కూలీలకు మాత్రం నగదు రూపంలో చెల్లింపులు జరగాలి. కానీ అలా జరగడం లేదు.
 
 టీడీపీ నేతలకు కలిసొచ్చిన ‘కోడ్’
 పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి, ఆవురావురుమంటున్న తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి తరగతి గదుల నిర్మాణాన్ని తమ ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు ఎస్‌ఎంసీల మాటున పనులు చేజిక్కించుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో పరిపాలనామోదం లభించినా ఎన్నికల కోడ్ తొలగే వరకు ఈ పనుల జోలికి వెళ్లలేదు. అదే ‘దేశం’ నేతలకు కలిసివచ్చింది. కోడ్ ఎత్తి వేయగానే పగ్గాలు చేపట్టకుండానే పనులు దక్కించుకున్నారు. గతంలో 70 శాతం పనులు ఎస్‌ఎంసీల ద్వారా, 30 శాతం కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ ప్రస్తుతం 20 శాతం పనులు కూడా ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 80 శాతం పనులు ‘పచ్చ’ కాంట్రాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి.
 
 గదికి రూ.2 లక్షల చొప్పున డ్రా!
 ఒక్కో గదికి 70 శాతం చొప్పున రూ.3.50 లక్షల మేర ఇప్పటికే ఎస్‌ఎంసీ ఖాతాలో జమైతే.. పనులు ప్రారంభించకుండానే రూ.2 లక్షల చొప్పున డ్రా చేశారు. ఈ విధంగా 80 శాతం గదులకు సంబంధించి నిధులు డ్రా చేసి, వాటిలో 20 శాతం పర్సంటేజ్‌ల రూపంలో పంచుకుతిన్నారు. కాంట్రాక్టర్‌కు 10 శాతం, కమిటీ చైర్మన్‌కు రెండు శాతం, ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకూ 8 శాతం చొప్పున పంపిణీ జరిగినట్టు సమాచారం. అంటే రూ.53.88 కోట్లలో ఇప్పటికే రూ.37.70 కోట్ల మేర నిధులు ఎస్‌ఎంసీల ఖాతాలకు జమయ్యాయి. అంటే పాతిక కోట్ల వరకు పనులు ప్రారంభించకుండానే డ్రా చేశారన్నమాట. ఈ లెక్కన రూ.6 కోట్ల వరకు పర్సంటేజ్‌ల రూపంలో పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది.

 పాలనామోదం ఇచ్చి ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు కనీసం 400 గదుల నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కనీసం 10 శాతం గదులు కూడా పునాది దశ దాటలేదు. కానీ ఖాతాలకు జమైన సొమ్ములు డ్రా చేసి పంచేసుకున్నట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల దన్ను ఉందన్న బరితెగింపుతో పచ్చ కాంట్రాక్టర్లు గదికి రూ.2 లక్షల చొప్పున డ్రా చేసుకోవడంతో ప్రధానోపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. పనులు ప్రారంభిస్తారో లేక డ్రా చేసిన సొమ్ములు స్వాహా చేసి, ఊరుకుంటారో తెలియక వారి కంటి కి కునుకు కరువవుతోంది. ఎమ్మెల్యేలను ఎదిరించలేక, వారి సూచనల మేరకు వారి అనుచరులకు నిధులను డ్రా చేసి ఇచ్చామని, పనులు ప్రారంభించమంటే ‘ఇదిగో చేస్తాం..అదిగో చేస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారని కోనసీమకు చెందిన ఓ హైస్కూల్ ప్రధానో పాధ్యాయుడు ‘సాక్షి’ వద్ద ఆవేనద వ్యక్తం చేశారు.
 
 నెలాఖరులోగా ప్రారంభించాలన్న డీఈఓ!
 ఈ పనుల విషయమై ఆదివారం సమీక్షించిన డీఈఓ శ్రీనివాసులురెడ్డి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన ఈ పనులు ఇంకా ఎందుకు ప్రారంభించ లేదంటూ మండిపడినట్టు సమాచారం. మంజూరైన మొత్తం అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని నెలాఖరు లోగా ప్రారంభించి తీరాలని ఆదేశించినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement