మద్యం తాగితే కరోనా రాదనేది అపోహే!

Coronavirus Propaganda About Drinking Alcohol Is Unreal - Sakshi

మద్యం మానుకోవడానికి లాక్‌డౌన్‌ ఒక ట్రయల్‌ రన్‌గా భావిస్తున్నాం

సంపూర్ణ మధ్యనిషేధ సంకల్పానికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలి

మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి 

ఒంగోలు: మద్యం తాగితే కరోన రాదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి అన్నారు. సోమవారం ఒంగోలు ఎక్సయిజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయమై స్పష్టత ఇచ్చిందని, కనుక ప్రజలు ఈ విషయాన్ని గమనించి మద్యం వైపు దృష్టిసారించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ, మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3500 మద్యం షాపులు, 800కుపైగా ఉన్న బార్లను మూసివేయడం జరిగిందన్నారు. కొంతమంది మద్యం వ్యాపారులు, ప్రభుత్వ మద్యం దుకాణాలలోని సిబ్బంది చేతివాటం చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు కూడా చేపడుతున్నామన్నారు.

ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా మద్యం అక్రమాలను ప్రోత్సహిస్తే సహించవద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఈనెల 19వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా 2178 అక్రమ మద్యం కేసులు నమోదుచేసి 2213 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 16405 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం, 3,61,500 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యాన్ని సీజ్‌చేయడం జరిగిందని, 3వేల లీటర్ల కల్లును పట్టుకున్నారన్నారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న 464 వాహనాలను సీజ్‌ చేశారంటూ ఎక్సయిజ్‌ సిబ్బందిని అభినందించారు.

వాస్తవానికి కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండడంతో వారిని ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్‌ చేయాల్సి వచ్చిందని, దీంతో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికి బాగా పని చేస్తున్నారన్నారు. నిర్లక్ష్యం, అక్రమాలను సహించేదిలేదన్నారు.    సంపూర్ణ మధ్య నిషేధ ప్రభుత్వ సంకల్పానికి ప్రస్తుత లాక్‌డౌన్‌ పీరియడ్‌ మద్యం ప్రియులు మద్యం వ్యసనాన్ని మానడానికి ఒక ట్రయల్‌ రన్‌గా భావిస్తున్నామన్నారు. మద్యం మానాలనుకునే వారి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్యశాలల్లో, బోధన ఆసుపత్రుల్లో డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యానికి సంబంధించిన సమాచారాన్ని 14500 లేదా 18004254868 నంబర్లను సంప్రదించాలని, గుంటూరు న్యూలైఫ్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌ సేవలను 9849347500 ద్వారా పొందవచ్చన్నారు.

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చీరాలలో ఒకటి, ఒంగోలులో ఒక బార్‌లో మద్యం నిల్వలకు సంబంధించి వ్యత్యాసాలు వెలుగు చూశాయని, ఒకటి రెండు రోజుల్లో లైసెన్స్‌లను సస్పెండ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. గిద్దలూరులో ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. మార్చి 22 నుంచి ఈనెల 19వ తేదీ నాటికి 8 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన మద్యం కేసులు మూడు, నాటు సారా తయారీ కేసులు 35 నమోదు చేసి మొత్తం 24 వాహనాలను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top