అనంతపురంలో మరో 4 పాజిటివ్‌ కేసులు  

Coronavirus: 33 Corona Cases In Anantapur District - Sakshi

33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య  

అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం  

సాక్షి, అనంతపురం: జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోంది. సోమవారం మరో నలుగురు కరోనా వైరస్‌ బారినపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 33కు చేరింది. తాజాగా వైరస్‌ బారిన పడిన వారిలో ఎస్‌వీఐటీ క్వారంటైన్‌లో ఉన్న గుజరాత్‌కు చెందిన 17 ఏళ్ల, 21 ఏళ్ల పురుషులు, కళ్యాణదుర్గం తిమ్మసముద్రానికి చెందిన చెందిన 36 ఏళ్ల వ్యక్తి, హిందూపురానికి చెందిన 40 ఏళ్ల మహిళ ఉన్నారు. (ప్రేమ పెళ్లికి పోలీసుల భరోసా)

క్వారంటైన్‌లోని ఇద్దరికి.. 
లాక్‌డౌన్‌తో జిల్లాలో ఇరుక్కుపోయి రాప్తాడులోని ఎస్‌వీఐటీ క్వారన్‌టైన్‌లో ఉంటున్న గుజరాత్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రెండురోజుల క్రితం ఈ క్వారన్‌టైన్‌లోని 64 మందికి నమూనాలను తీసుకున్నారు. అందులో ఇద్దరు కరోనా వైరస్‌ సోకినట్లు రిపోర్టులో వెల్లడైంది. 

‘పురం’లో ఒకరు.. తిమ్మసముద్రంలో మరొకరు 
హిందూపురంలోని ఓ మహిళా తహసీల్దార్‌ ఇంటి పనిమనిషి 40 ఏళ్ల మహిళ కూడా కరోనా బారిన పడ్డారు. అలాగే కళ్యాణదుర్గం మానిరేపుకు చెందిన ఓవ్యక్తి కరోనాతో మృత్యువాత పడగా.. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రానికి చెందిన వ్యక్తి వైరస్‌ బారిన పడ్డారు. సోమవారం పాజిటివ్‌గా తేలిన వారిని అధికారులు బత్తలపల్లి ఆర్డీటీకి రెఫర్‌ చేశారు. అక్కడే ఉంచి వైద్యం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

రెడ్‌జోన్‌ ప్రాంతాలపై పోలీసు నిఘా 
హిందూపురంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం నాటికి జిల్లాలో 33 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా...అందులో హిందూపురం నుంచే 18 కరోనా కేసులుండటం యంత్రాంగాన్ని కలవర పెడుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావు ఆధ్వర్యంలో జిల్లా, స్థానిక అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి కంటైన్మెంట్‌  ప్రాంతాలకు మండలస్థాయి అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించారు. రెడ్‌జోన్లలోని వారికి అవసరమైన నిత్యావసరాలు, ఇతర సదుపాయలు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో రెడ్‌జోన్‌కు   సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి బందోబస్తు చేపడుతున్నారు.

ప్రజలెవరూ రోడ్లపైకి రాకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. అలాగే ద్విచక్ర, ఇతర వాహనాలు వస్తే వాటిని సీజ్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ మహబూబ్‌బాషా హెచ్చరించారు. ఇక ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన వారితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి జమాత్‌ సమావేశాలకు వచ్చి హిందూపురంలో నిలిచిపోయిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

అధికారుల అప్రమత్తం 
కరోనా కేసులు అధికమవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితులు కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి వారిని క్వారన్‌టైన్‌ను తరలించారు. ఇంకా గుంతకల్లు, హిందూపురం, రాప్తాడు, తదితర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులకు సన్నిహితంగా ఉన్నవారిని క్వారన్‌టైన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు సర్వజనాస్పత్రిలోని కొంతమంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జాప్యమవుతున్నాయి. ఐసోలేషన్, పాజిటివ్‌ కేసులకు కాంటాక్ట్‌ అయిన వారు రెండ్రోజులుగా పరీక్ష చేయించుకునేందుకు ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా పరీక్షలు చేయడం లేదు. చివరకు విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ దృష్టికి తీసుకెళ్లగా వివరాలివ్వాలని, తామే ఫోన్‌ చేస్తామని వారిని వెనక్కి పంపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top