నామాలు పెట్టినా చూసి చూడనట్టే

నామాలు పెట్టినా చూసి చూడనట్టే - Sakshi


 కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుకు తాజా తార్కాణం

 బాబు ఆపద్ధర్మ సీఎంగా ఉండగా టీడీపీ నేత నామాకు భూ సంతర్పణ

 కూకట్‌పల్లిలో విలువైన స్థలం కారుచౌకగా కేటాయింపు

 విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన అక్రమాలు

 అధికారులందరినీ మేనేజ్ చేశారని నివేదిక వెల్లడి

 ఒప్పందం రద్దుకు, సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు

 ఆర్నెల్లు దాటినా అసలే పట్టించుకోని కిరణ్ సర్కారు


 

 సాక్షి, హైదరాబాద్: ‘అయినవారికి ఆకుల్లో...’ అన్న సామెతను మరోసారి అక్షరాలా నిజం చేసి చూపిస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. టీడీపీ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయిన ‘తమ్ముళ్ల’ అక్రమాలకు సంబంధించి మరో ఉదంతం ససాక్ష్యంగా వెలుగుచూసినా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తోంది. టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక ప్రాజెక్టును అడ్డదారిలో చేజిక్కించుకుందని స్వయానా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  విభాగమే నిగ్గుదేల్చింది. తప్పుడు పత్రాలు సమర్పించడం, కంపెనీ సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూపడం వంటి అనేకానేక అవకతవకలకు పాల్పడ్డట్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారులపై కేసులు పెట్టడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు కూడా సిఫార్సు చేసింది. ‘మధుకాన్‌తో పాటు ప్రభుత్వ సంస్థలైన ఏపీహెచ్‌బీ, క్రిసిల్ తదితరాలపైనా కుట్ర, మోసం, అవినీతి కేసులు పెట్టాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి’ అని విస్పష్టంగా సూచించింది. ఒప్పందాన్ని రద్దు చేయూలని, ఇంకా అభివృద్ధి చేయని భూమిని వేలం     వేయాలని సిఫార్సు చేసింది. తద్వారా ఖజానాకు రూ.539.75 కోట్ల అదనపు ఆదాయుం ఖాయమని లెక్కగట్టి మరీ చెప్పింది. అయినా సరే, కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎంపీ సంస్థ బాగోతాన్ని ‘చూసీ చూడనట్టే’ పోతోంది. విజిలెన్స్ నివేదిక ఇచ్చి ఆర్నెల్లు దాటినా తీరిగ్గా మీనమేషాలు లెక్కిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటోంది. ఈ అంతులేని ‘నిర్లిప్తత’ వెనక దాగున్న అసలు కారణం కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలేనన్నది ప్రస్తుతం సర్వత్రా విన్పిస్తున్న మాట.



 ఏం జరిగింది...

 

 2004 ఫిబ్రవరిలో, చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేందుకు సిద్ధమవుతున్న రోజుల్లో మధుకాన్‌కు ఒక ప్రాజెక్టును కట్టబెట్టారు. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో జాతీయ రహదారి సమీపంలో 7.92 ఎకరాల విస్తీర్ణంలో హోటళ్లు, షాపింగ్ మాల్స్ తదితర భవనాలు నిర్మించడం ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం బినాపురి అనే మరో కంపెనీతో మధుకాన్ సంస్థ జట్టుకట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీహెచ్‌బీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి. భూమిని తమకు అప్పగించాలని, నామమాత్రపు ధర చెల్లిస్తామని మధుకాన్-బినాపురి కన్సార్షియం చంద్రబాబు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అందుకు ఏపీహెచ్‌బీ వైస్ చైర్మన్ అభ్యంతరం చెప్పినా, విలువైన ఆ స్థలాన్ని వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.180.8 కోట్ల ఆదాయం వస్తుందని మొత్తుకున్నా లాభం లేకపోయింది. అప్పటికి కనీసం రూ.50 కోట్ల టర్నోవర్ కూడా దాటని మధుకాన్, రూ.39.78 కోట్లు చెల్లిస్తానంటే బాబు సర్కారు ‘విశ్వసించింది’. సరేనంటూ భూమిని కట్టబెట్టేసింది.

 

 ఆద్యంతం నిబంధనలకు తూట్లు

 

 ఆ తర్వాత మరిన్ని అవకతవకలకు తెరలేచింది. పని అనుభవం, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాల్లో మధుకాన్‌కు అర్హతలు లేకున్నా దాన్ని క్వాలిఫైడ్ కంపెనీల జాబితాలో చేర్చారు. 2004 ఏప్రిల్ 24న చేసుకున్న అభివృద్ధి ఒప్పందం ప్రకారం ప్రాజెక్టును ఐదేళ్లలో, అంటే 2009 ఏప్రిల్‌కల్లా పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. ‘2.62 ఎకరాల్లో నామా హోటల్స్, 5.3 ఎకరాల్లో మధుకాన్ మెగామాల్, 1.12 ఎకరాల్లో మధుకాన్ హైట్స్‌ను నిర్మించి అభివృద్ధి చేస్తాం’ అంటూ మధుకాన్ కన్సార్టియం 2008లో సవరించిన ప్రాజెక్ట్ నివేదికను సమర్పించింది. దాంతో ఏపీహెచ్‌బీ అధికారులు ఉదారంగా ప్రాజెక్టు గడువును 2011కు పెంచారు. కానీ అప్పటికీ పని పూర్తి కాలేదు. పైగా మరో ఆరేళ్ల సమయం కావాలని, 2017 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని మధుకాన్ కన్సార్షియం మళ్లీ విజ్ఞప్తి చేసింది. ఏమైందో ఏమో గానీ ఈసారి మాత్రం ఏపీహెచ్‌బీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.

 

 దర్యాప్తు తేల్చిన అంశాలివీ...

 

 ఈ మొత్తం వ్యవహారంపై పరిశీలన జరిపిన విజిలెన్స్ 2013 ఆగస్టులోనే నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకున్నది మొదలు ఇప్పటివరకూ అనేకానేక అంశాల్లో నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది.

 - ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఏపీహెచ్‌బీ అధికారులను వుధుకాన్ యుజవూని ‘మేనేజ్’ చేశారు

 - మధుకాన్ సమర్పించిన ఆసక్తి వ్యక్తీకరణ లేఖను ఏపీహెచ్‌బీ అధికారులే సమీక్షించారు. మామూలుగానైతే ఈ పని క్రిసిల్ లాంటి జాతీయ స్థాయి సంస్థలు చేయాలి. చేసినట్టుగా చెబుతున్నారంతే (క్రిసిల్ పోషించిన పాత్రనూ విజిలెన్స్ తప్పుబట్టింది)

 - తనకున్న అనుభవం గురించి కూడా మధుకాన్ తప్పుడు పత్రాలు సమర్పించింది. ‘వర్క్ కాంట్రాక్ట్స్’గా పనులు చేపట్టిన అనుభవం తమకుందని పత్రాలు సమర్పించింది. కానీ ఈ రకమైన పనులు చేపట్టేందుకు ‘డెవలపర్’ తరహా అనుభవం ఉండాలని ఈఓఐ స్పష్టం చేస్తోంది.

 - సాంకేతిక కన్సార్షియం సభ్యుడు (బీనాపురి) పైసా ఈక్విటీ స్టేక్ కూడా లేకుండా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయడం మరో అవకతవక వ్యవహారం. బీనాపురి కంపెనీ మధుకాన్ కన్సార్షియంలో లేకున్నా, ఆ విషయాన్ని కప్పిపుచ్చారు. పైగా ఆ కంపెనీకి 11 శాతం ఈక్విటీ ఉన్నట్టుగా పత్రాలు సమర్పించారు.

 - ఇంకా అభివృద్ధి పరచని 7.92 ఎకరాల భూమికి సంబంధించి పాత ఒప్పందాలను రద్దు చేయూలి. వాటికి తాజాగా వేలం నిర్వహించాలి. తద్వారా సర్కారుకు రూ.539.75 కోట్ల అదనపు ఆదాయుం వస్తుంది

 - క్రిసిల్‌ను ఇకపై ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల సలహా సేవలకూ దూరంగా ఉంచాలి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top