కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలి

Complete All Irrigation Projects Says YSR Kadapa - Sakshi

కడప కార్పొరేషన్‌: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌ . రఘురామిరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో  కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జురెడ్డిలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125ఏళ్ల చరిత్ర కలిగి బ్రిటిషు హయాంలో నిర్మించిన కేసీ కెనాల్‌కు నీరివ్వకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాలు లేక వేలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, రైతులు నష్టాలపాలయ్యే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధిస్తోందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలో 870 అడుగుల నీటిమట్టం ఉందని, అంటే సుమారు 150 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. కేసీ కెనాల్‌ పరిధిలో ఖరీఫ్‌కు నీరిస్తున్నామని చెప్పి టీడీపీ నాయకులు పది రోజుల క్రితం రాజోలి స్లూయిస్‌ వద్దకు వెళ్లి ఆర్భాటంగా నీటిని వదిలారన్నారు.

టీడీపీ నాయకుల మాటలు విని రైతులు నారుమళ్లు వేసుకున్నారని, కుందూ పరివాహక ప్రాంతంలో నాట్లు నాటేందుకు సిద్దమవుతున్నారన్నారు. ఈలోపే ఉన్నట్టుండి నీరు ఆపేశారన్నారు. లక్ష ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కుల చొప్పున ఖరీఫ్‌ వరకు వదలాలని డిమాండ్‌ చేశారు. దీనిపై కర్నూలు సీఈకి, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇరిగేషన్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్నారు. పైర్లు ఎండిపోయాక నిర్ణయం తీసుకొని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నప్పటికీ వదలకపోవడం సరికాదన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో 40వేల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారని, నికర జలాలు కలిగిన కేసీకి ఇవ్వకపోవడం సరికాదన్నారు.

ఈ పరిస్థితి వస్తుందనే 2008లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2.95 టీఎంసీ సామర్థ్యంతో రాజోలి, 0.95టీఎంసీల సామర్థ్యంతో జొలదరాసి రిజర్వాయర్‌లకు శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని ఎన్ని ఆందోళనలు చేసినా, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  వెలుగోడు నుంచి 0–18 కీ.మీ వరకు కాలువలు సరిగా లేవని, ఆ పనులు పూర్తి చేస్తే తెలుగుగంగకు నీరు ఇవ్వచ్చన్నారు. దీనిపై తాము కర్నూలు ఐఓబీ సమావేశంలో చెప్పినా, అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.

పరిస్థితి ఇలాగే ఉంటే కడుపు కాలిన రైతులు ప్రభుత్వంపై తిరగబడతారని హెచ్చరించారు. వెంటనే ఇరిగేషన్‌ మంత్రి సీఎంతో మాట్లాడి కేసీ కెనాల్‌కు 2వేల క్యూసెక్కులు, వెలుగోడు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  గాలేరు నగరి, సర్వరాయసాగర్, వామికొండ, పైడిపాళెం రిజర్వాయర్‌లకు కూడా నీటిని విడుదల చేయాలన్నారు. వర్షాకాలం ఇంకా చాలా ఉందని, సాగునీటికి నీటిని వదలకుండా విద్యుత్‌ ఉత్పత్తికి తరలించడం ఎంతమాత్రం సరికాదన్నారు. పదివేల క్యూసెక్కులు విడుదల చేస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తాయన్నారు. నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

కేసీకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలి
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్‌ .రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, నగర మేయర్‌ కె. సురేష్‌బాబు కోరారు.  సోమవారం సాయంత్రం వారు జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.అలాగే జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంపగుత్తగా తొలగించిన ఓట్లను మళ్లీ చేర్చాలని వారు కోరారు. ఈ విషయాలపై కలెక్టర్‌ స్పందిస్తూ ఇరిగేషన అ««ధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేస్తానని, ఓట్ల తొలగింపుపై  అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top