అన్నదాత.. ఆక్వా జిల్లాకు రెండు కళ్లు

Collector Praveen Kumar Visit Aqua Farms in West Godavari - Sakshi

ఆక్వా రంగం అభివృద్ధికి కృషి

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌  

ఆకివీడు: వ్యవసాయం, ఆక్వా రంగాలు జిల్లాకు రెండు కళ్లులాంటివని, వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. మండలంలోని చినకాపవరం, రామయ్యగూడెం ప్రాంతాల్లోని ఆక్వా చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన వనరులుగా ఉన్న వ్యవసాయం, ఆక్వా రంగాన్ని అభివద్ధి చేసినప్పుడే జిల్లా ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని అన్నారు. పారిశ్రామికంగా జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వరి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు. ధాన్యానికి మద్దతు ధర లభించేందుకు, ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఆక్వా సాగులోని ఇబ్బందులను రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తనదృíష్టికి తీసుకువచ్చారని తులిపారు. జిల్లాలో 67,518 హెక్టార్లలో ఆక్వా చెరువులున్నాయని, దీనిలో 21 వేల హెక్టార్లలో రొయ్యల సాగు చేస్తున్నారన్నారు. చేపల సాగులో మేత, ఇతరత్రా వినియోగంలో అధిక వ్యయం తగ్గించుకునేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రొయ్యల సాగు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని రైతులు చెబుతున్నారన్నారు. నష్టం అపారంగా ఉంటుందని, లాభాలు వస్తే అంతంత మాత్రమేనని రొయ్య రైతులు తెలిపారన్నారు. రొయ్యల ధరను సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారులు తగ్గిస్తున్నారనే వాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. రైయ్య రైతులకు కోల్డ్‌ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితర సమ్యలున్నాయని చెప్పారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాకు ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యానికి «మద్దతు ధర ప్రకటించినట్లుగా రొయ్యలు, చేపల ధరలు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారని కలెక్టర్‌ తెలిపారు.

ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు కలెక్టర్‌  చెప్పారు. ఆక్వా అభివృద్ధి జరిగితే జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. వరి రైతులకు ఇబ్బంది లేకుండా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. కొత్తగా చెరువులు తవ్వేందుకు అనుమతులను జిల్లా స్టీరింగ్‌ కమిటీ సమావేశాల ద్వారా మంజూరు చేస్తామన్నారు.

రొయ్య రైతుల్ని ఆదుకోవాలి
రొయ్య రైతుల్ని ఆదుకోవాలని, ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఇందుకూరి మోహనరాజు, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేగేశ్న సత్యనారాయణరాజు  కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పంట చేతికి అందేంత వరకూ నమ్మకం లేదని, 20 నుండి 40 శాతం పంట వైరస్‌కు గురవుతుందని చెప్పారు. కౌంటింగ్‌ ఉన్న రొయ్యకు ధర లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆక్వా రైతు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వేగేశ్న వెంకట్రాజు(యండగండి శ్రీను) మాట్లాడుతూ రొయ్యల ధర నికరంగా ఉండేలా చర్యలు తీసుకోవలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ వెంట ఆక్వా రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు(సూరిబాబు), అల్లూరి తమ్మిరాజు, ఇందుకూరి సూర్యనారాయణరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, మత్స్యశాఖ జేడీ ఎస్‌.అంజలి, డీడీ తిరపతయ్య, ఏడీ చాంద్‌ బాషా, నరసాపురం ఆర్డీఓ సలీం ఖాన్, ఎఫ్‌డీఓ మంగారావు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top