రోగికి ఇబ్బంది పెడితే సహించను

Collector Kona Sasidhar Visit GGH Hospital Guntur - Sakshi

జీజీహెచ్‌ హెచ్‌డీఎస్‌ సమావేశంలో కలెక్టర్‌ శశిధర్‌ ఫైర్‌

రెండు నెలలుగా ఆపరేషన్‌ థియేటర్‌లో లైట్లు, వెంటిలేటర్లు లేని దుస్థితి

చేతకాకపోతే కాంట్రాక్ట్‌ విరమించుకోవాలని హెచ్చరిక

రోగులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు

జీజీహెచ్‌లో సెల్‌ఫోన్‌ లైట్‌తో ఆపరేషన్‌ నిర్వహించిన తీరుపై కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆస్పత్రిలోని శుశ్రుత హాల్‌లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమైన ఆయన లైట్లు ఏర్పాటు చేయని సంస్థపై మండిపడ్డారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న కాంట్రాక్ట్‌ సంస్థను కథలు చెప్పొద్దంటూ మందలించారు. రోగికి ఇబ్బంది కలిగితే తన సమస్యగా భావిస్తానని స్పష్టం చేశారు. 

సాక్షి, గుంటూరు: రోగులకు ఇబ్బంది కలిగించే సమస్యను తన దృష్టికి తీసుకొస్తే తన సమస్యగా భావిస్తానని ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ అన్నారు. జీజీహెచ్‌లోని శుశ్రుత హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సెల్‌ఫోన్‌ వెలుతురులో ఆపరేషన్‌ ఎందుకు చేశారని, దానికి గల కారణాలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు స్పందించిన రెండు నెలలుగా ఆపరేషన్‌ థియేటర్లలో లైట్‌లు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. రెండు నెలలుగా ఆపరేషన్‌ థియేటర్లలో లైట్‌లు పనిచేయకపోయిన పట్టించుకోని టెలిమ్యాట్రిక్‌ బయోమెడికల్‌ సర్వీసెస్‌ సంస్థ ప్రతినిధుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు వాటి స్థానంలో కొత్త పరికరాలను అమర్చలేదని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెపుతున్న టీబీఎస్‌ ప్రతినిధులను కథలు చెప్పొద్దని హెచ్చరించారు. బాధ్యతగా విధులు నిర్వహించడం చేతకాకపోతే కాంట్రాక్ట్‌ మానుకోవాలని సూచించారు. అనంతరం మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు నిధులు మంజూరైన నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజీనీర్‌ను కలెక్టర్‌ అడిగారు. ఆస్పత్రిలోకి ప్రవేశించగానే కొందరు రోగులు తనకు లేబర్‌ వార్డులోని బాత్‌రూముల్లో నీటి సరఫరా లేదని ఫిర్యాదు చేశారని, నీటి సరఫరాకు ఎందుకు అంతరాయం ఏర్పడుతోందని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ని ప్రశ్నించారు. వాటర్‌ ట్యాంక్‌లకు సెన్సార్లు లేకపోవడం వల్ల సమస్య తలెత్తుతోందని ఆయన సమాధానం ఇచ్చారు. వీలైనంత త్వరగా ఆస్పత్రిలోని నీటి సరఫరా సమస్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా ఉద్యోగం... నా వేతనం అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.

ప్రతి వార్డుకు ఓ ఇన్‌చార్జి
ఆస్పత్రిలోని ప్రతి వార్డుకు ఒక హెచ్‌వోడీని, యూనిట్‌ ఇన్‌చార్జిని నియమించాలని సూపరింటెండెంట్‌ రాజునాయుడికి కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు. ఆస్పత్రిలోని ప్రతి సమస్యను సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు గుర్తించలేరని ప్రతి వార్డుకు యూనిట్‌ ఇన్‌చార్జిలను నియమిస్తే వారే ఆ వార్డుకు బాధ్యత వహిస్తారన్నారు. రోగులకు ఏ చిన్న సమస్య వచ్చిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోడానికి కూడా వెనుకాడబోనని సిబ్బందిని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవలో ఎదురవుతున్న సమస్యలను డాక్టర్లను కలెక్టర్‌ అడిగారు. తెల్లరేషన్‌ కార్డు లేని వారు సీఎంఆర్‌వో అప్రూవల్‌ తీసుకోవడానికి విజయవాడకు వెళ్లాల్సి వస్తోందని, ఇంతకు ముందు రేషన్‌కార్డు లేని వాళ్లకు గుంటూరులోనే ఈ సౌకర్యం ఉండేదని దాన్ని తిరిగి గుంటూరులోనే ఏర్పాటు చేయాలని వైద్యులు కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి గుంటూరులో తిరిగి సీఎంఆర్‌వోను ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు.

ప్రైవేటు మెడికల్‌ షాపులను ప్రోత్సహించొద్దు
రోగులకు అవసరమైన మందులన్నింటిని ఆస్పత్రిలోనే సరఫరా చేయాలని ప్రైవేటు మెడికల్‌ షాపులను ప్రోత్సహించే పనులు చేయొద్దని మెడికల్‌ విభాగం వారికి కలెక్టర్‌ సూచించారు. ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు లభించడం లేదని రోగులు బయట మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఆస్పత్రిలో లేని మందుల వివరాలను జీజీహెచ్‌ మెడికల్‌ స్టోర్‌ ఇన్‌చార్జి విజయశ్రీని అడిగారు. ఆమె స్పందిస్తూ 40 రకాల మందులు ఆస్పత్రిలో లేవని చెప్పారు. దీనిపై ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడి మందులను తెప్పిస్తానని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుబ్బారావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఆదినారాయణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్ని విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top