కలెక్టర్‌ను అభినందించిన  సీఎం | CM Jagan Video Conference With Nellore Collector | Sakshi
Sakshi News home page

 కలెక్టర్‌ను అభినందించిన  సీఎం

Jul 11 2019 11:20 AM | Updated on Jul 11 2019 11:20 AM

CM Jagan Video Conference With Nellore Collector - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, హాజరైన కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు

సాక్షి, నెల్లూరు :  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘స్పందన’ పేరిట తీసుకున్న కార్యక్రమానికి జిల్లాలో చేపట్టిన చర్యలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబును అభినందించారు.  బుధవారం స్పందన కార్యక్రమం అమలుపై సీఎం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  సీఎం జిల్లా కలెక్టర్‌ను శేషు (శేషగిరిబాబు) అని పిలుస్తూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని 24 గంటల్లో సంబంధిత అధికారులకు చేరవేయడంలో చేపట్టిన చర్యలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఎస్పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాలో అమలు చేసిన ప్రక్రియను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శేషు స్పందనకు మీరు తీసుకున్న చర్యలు విశేషంగా ఉన్నాయని, అర్జీదారులు ఇంట్లో కూర్చుని వారికి ఇచ్చిన రశీదు ద్వారా సమస్య పరిష్కారం ఏ రూపంలో ఉందో తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

అర్జీలకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండల స్థాయిలో తహశీల్దార్లు అవినీతికి పాల్పడకుండా సక్రమంగా పని చేస్తే కలెక్టర్‌కు పేరు వస్తుందన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అవినీతి లేకుండా కేసులు పరిష్కరిస్తే ఎస్పీకి పేరు వస్తుందన్నారు. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత కూడా ప్రజలు అధికారుల పేరు చెప్పుకోవాలన్నారు. ప్రజలకు ఆ విధమైన పాలన అందించాలని సీఎం సూచించారు. మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు అవినీతి, లంచాలు నిరోధించేలా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్, ఎస్పీలు ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి పారదర్శకత, విశ్వసనీయత, అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తమవంతు సహాయ సహకారాలు అందించాలన్నారు.

ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని సీఎం వివరించారు. జిల్లా కలెక్టర్లు మావతా దృక్పథం, సేవాతత్పరణతో తక్షణమే స్పందించి జిల్లాలో మరణించిన అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏక్స్‌గ్రేషియా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతుల కుటుంబాలకు ఓదార్పునిచ్చి వారిలో ఆత్మస్థైర్యం నింపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీదారులు 550 వినతులు సమర్పించారన్నారు. అర్జీదారులు సమర్పించిన వినతులను సంబంధిత అధికారులకు స్పీడ్‌పోస్టు ద్వారా 24 గంటల్లో అందజేయడం జరిగిందన్నారు. అర్జీదారులకు స్పందనలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఐదు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విభాగాల వారీగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరిగిందని సీఎంకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో సీ చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement