తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట నాయకుల మధ్య వర్గ పోరు ఉధృతమైంది.
(గణేష్)
పాయకరావుపేట: తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా పాయకరావుపేట నాయకుల మధ్య వర్గ పోరు ఉధృతమైంది. పార్టీ నియోజకవర్గం సమస్వయ కమిటీ సభ్యుడు చింతకాలయ రాంబాబు వర్గీయులు జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండల టిడిపి అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు, రాంబాబులను సస్పెండ్ చేశారు. పాయకరావుపేట నియోజక వర్గం బాధ్యురాలు అనిత నియామకాన్ని వీరిద్దరూ వ్యతిరేకిస్తున్నారు. గ్రూపులు కడుతూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న రామానాయుడు ప్రకటించారు. దాంతో తాడోపేడో తేల్చుకోవడానికి రాంబాబు వర్గీయులు సిద్ధపడ్డారు.
మండలంలోని అత్యధికమంది కార్యకర్తలు వీరిద్దరివైపే ఉన్నారు. సరైన కారణాలు చూపకుండా రాంబాబు, వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్ వెనక్కి తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.