సర్వేశ్వరా..!

Civil Supplies Officers Survey On White Ration Cards - Sakshi

తెల్ల రేషన్‌ కార్డులపైనా వేటు

జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు: 12.57 లక్షలు

సర్వే పూర్తికాని కార్డులు :  2.07

కార్డులను తొలగించేందుకు కసరత్తు

కొత్తగా తెల్లకార్డు జారీకి సర్వే తప్పని సరి

తెల్లకార్డు.. పేదలకు ఆధారం.. పల్లె నుంచి పట్టణ ప్రజల వరకు కార్డు కోసం ఎదురు చేస్తుంటారు.. రేషన్‌ నుంచి వైద్యం వరకు కార్డుతోనే లబ్ధి.. సబ్సిడీ అవకాశం ఉండడంతో పేదలు ఆసరాగాభావిస్తున్నారు.. ప్రభుత్వం మాత్రంఎప్పటికప్పడు దొడ్డిదారిన తొలగించేందుకు ఎత్తులు వేస్తుంటోంది.. అందులో భాగంగా  సాధికార సర్వే చేయించింది. దీంతో లక్షల కార్డులు రద్దుకానున్నాయని వార్తలు వస్తున్నాయి.. దీంతో పేదలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

సాక్షి, విజయవాడ: జిల్లా 12.57లక్షల తెల్ల రేషన్‌కార్డు లున్నాయి. గత ఏడాది జిల్లాలో నిర్వహించిన సాధికార సర్వేలో వేలాది మంది సర్వే చేయించుకోలేకపోయారు. ప్రస్తుతం తెల్లరేషన్‌కార్డు ఉండి సాధికార సర్వే చేయించుకోని వారు జిల్లాలో 2.07 లక్షలు మంది ఉన్నట్లు పౌరసరఫరాల అధికారులు నిర్ధారించారు. ఈ కార్డులను త్వరలోనే సాధికార సర్వే చేయించాలని, సాధికార సర్వేలో గుర్తింపు పొందని కార్డులను తొలగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో ఆర్థిక పరిస్థితిని తెల్లకార్డు కొనసాగించలా లేదా అని నిర్ణయించనున్నారు.  సర్వే జరుగుతున్న సమాచారం చాలా మందికి తెలియదు. సర్వే చేసిన రెవెన్యూ, నగర పాలకసంస్థ సిబ్బంది కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే చేసి, పేదల బస్తీలు, మారు మూల ప్రాంతాలను సర్వే చేయలేదు. సర్వే సరిగా చేయకుండా ఇప్పుడు కార్డులు తొలగిస్తే తాము ఇబ్బంది పడిపోతామని కార్డుదారులు వాపోతున్నారు.

కొత్త రేషన్‌ కార్డులకు సాధికార సర్వేఅవసరం...
జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో సుమారు 30 వేల మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుతో పాటు సాధికార సర్వే చేయించినట్లు గుర్తింపు ఉంటేనే కొత్త కార్డు జారీ చేస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. అందువల్ల సాధికార సర్వే చేయించుకోకపోతే చేయించుకుని ఆ తరువాతనే తెల్ల రేషన్‌కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తిరిగి సాధికార సర్వే...
జిల్లాలో మరోకసారి సాధికార సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 15 రోజుల్లో సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొన్నాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం కోరారు. దీనికోసం తిరిగి టీమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా తెల్లకార్డు కలిగి ఉండి సాధికార సర్వేలో చేయించుకోని వారు తక్షణం సర్వేలో పాల్గొనాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అందువల్ల  తెల్లకార్డుదారులు తప్పని సరిగా తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించి సాధికార సర్వేలో తమ పేర్లు నమోదయ్యేటట్లు చూసుకోవాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top