
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆభరణాలు ఎప్పుడో ఇతర దేశాలకు తరలిపోయాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి బాంబు పేల్చారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన అనేక ఆభరణాలు, నాణేలు కూడా ఇప్పుడు లేవని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న దానిపై పురావస్తు శాఖ గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
కమిటీ సభ్యులు నెల రోజులపాటు పరిశీలించి చాలా ఆభరణాలు, నాణేలు లేనట్టు గుర్తించారని చెప్పారు. చాలా ఆభరణాలు, నాణేలను కరగబెట్టినట్టు కమిటీ సభ్యులు తేల్చారని వివరించారు. ‘పాత మిరాశీదారీ వ్యవస్థ సమయంలోనో.. అంతకుముందో చాలా నాణేలు కరగబెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సతీసమేతంగా తిరుమల పర్యటనకు వచ్చి ఎన్నో ఆభరణాలు, నాణేలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. విచారణ చేస్తే వాటికి సరైన రికార్డులు కూడా లేవని తేలింది’అని తెలిపారు. వివిధ శాసనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాల గురించి పురావస్తు శాఖ ‘గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేట్ బై కృష్ణదేవరాయల్ టూ ఆంధ్రా టెంపుల్స్’పేరుతో ఒక పుస్తకం ప్రచురించినట్టు చెప్పారు.
రాయల వారు ఏ సమయంలో పర్యటించారు? ఏ కానుకలు సమర్పించారన్నది శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారని.. వాటి వివరాలతో పుస్తకం ప్రచురించినట్టు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో విలువైన నాణేలు, వజ్రవైడూర్యాలు సమర్పించారని వీటిలో కొన్ని పర్షియన్ దేశాలకు, మరికొన్ని అరబ్ దేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో ముత్యాలను ఇంగ్లండ్‌కు తరలించుకుపోయిందని, అవన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడు ఎన్నో ఆభరణాలు ఆ ప్రాంతంలో ఉండిపోయాయని, వాటిని అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. రోమన్, శాతవాహన కాలం నాటి కొన్ని నాణేలు ఇప్పటికీ టీటీడీ మ్యూజియంలో ఉన్నాయని వెల్లడించారు.