అడ్డంగా దొరికినా విపక్షంపై ఆరోపణలా? | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికినా విపక్షంపై ఆరోపణలా?

Published Mon, Mar 7 2016 1:27 AM

అడ్డంగా దొరికినా విపక్షంపై ఆరోపణలా? - Sakshi

మంత్రి రావెలపై వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం
కేసు వెనుక జగన్ ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తారా అని ఆగ్రహం
 

చెరుకుపల్లి: మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఓ మహిళపై కీచకపర్వాన్ని సృష్టించిన ఫుటేజ్‌లను పలు చానళ్లలో  ప్రసారం చేసినా.. మంత్రి మాత్రం ఇదంతా ప్రతిపక్ష నాయకుల కుట్రని బుకాయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన ఆదివారం గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు సుశీల్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించినా.. దాని వెనుక విపక్ష నేత జగన్‌ఉన్నారని మంత్రి రావెల తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు. తునిలో నిర్వహించిన కాపుగర్జనలో గొడవ జరిగితే... , రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో భూములివ్వని రైతుల పంటల్ని తగులబెట్టించిన విషయంలోనూ జగనే ఉన్నారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం, మంద కృష్ణమాదిగ దీక్షల వెనుక జగనే ఉన్నారంటూ ఆరోపణలు చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని ఆయన అధికారపక్షానికి హితవు పలికారు.

రావెలను తప్పించాలి
చంద్రబాబు డెరైక్షన్‌లో మంత్రులు నడుస్తూ.. ముస్లిం మహిళ చేయి పట్టుకుని లాగిన మంత్రి రావెల తనయుడు సుశీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని అంబటి దుయ్యబట్టారు. చంద్రబాబుకు విలువలుంటే రావెలను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement