ఎన్టీఆర్‌ బతికుంటే...! | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ బతికుంటే...!

Published Thu, Nov 1 2018 8:17 PM

Chandrababunaidu manipulation specialist in AP Politics - Sakshi

సాక్షి, హైదరాబాద్ : 
ఆనాడు :  " ఎన్టీఆర్ పైన పోటీ చేయడానికి సిద్ధం... రాష్ట్రంలో ఎన్టీఆర్ గాలి ఎక్కడా లేదు... నేను ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో చేరే ప్రసక్తే లేదు... చంద్రగిరిలోనే కాదు పార్టీ అధిష్టానం కోరితే మామ (ఎన్టీఆర్) పైన పోటీ చేయడానికి సిద్ధం... "
- 1982 ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అన్న మాటలివి. ఆనాడు భవనం వెంకట్రాం నేతృత్వంలోని  కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవేకాదు... ఆనాడు సొంత మామపై విసిరిన సవాళ్లెన్నో. 

నాడు : " తెలుగు జాతిని చంపుతున్నది సోనియా... ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? ఇటలీ మాఫియాను తెచ్చారు. ఆమెకు మన నాగరికత తెలుసా? ప్రజాస్వామ్యం లేదు. సోనియా గాడ్సేగా వచ్చింది. ఇటాలియన్ మాఫియాను ప్రవేశపెట్టింది. సోనియా ఒక పెద్ద అవినీతి అనకొండ. దేశానికి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ రావాలంటే విదేశీయుల నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపాలి... ఖబడ్దార్ సోనియా... "   
- 2014 ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి, తాడేపల్లిగూడెం, పెదకూరపాటు తదితర ప్రాంతాల్లో జరిగిన సభలో చంద్రబాబు అన్న మాటలివి. 

గత ఎన్నికలకు ముందు : " సోనియా మొద్దు కుమారుడు రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవు. వ్యవస్థలన్నీ నాశనం చేస్తోంది. పనికిమాలిన, అసమర్థ ప్రధాని మన్మోహన్ కారణంగా దేశం సర్వనాశనమైంది. వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారు. దేశంలో పుష్కలంగా వనరులున్నప్పటికీ దివాళా తీసింది. సోనియా కక్కుర్తి రాజకీయంతో రాష్ట్రాన్ని బలిచేస్తున్నారు. దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. జాతి కోసం, దేశం కోసం ఎన్టీయేతో పొత్తు పెట్టుకున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సమగ్రతాభివృద్ధి సాధ్యమవుతుంది. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపగలరు"
- 2014 ఏప్రిల్ లో మచిలీపట్నం, పెడన, ఏలూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో చంద్రబాబు

ఇప్పుడు : "జాతి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిర్ణయించాం. అంతా కలిసి బీజేపీని ఓడించేందుకు భవిష్యత్తులో కలిసి పనిచేయాలని నిర్ణయించాం. ఇందులో కాంగ్రెస్ ది కీలక పాత్ర " 
- 1 నవంబర్ 2018 (అవతరణ దినోత్సవం) రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబునాయుడు

ఓటమితో తెరవెనుక రాజకీయాలు
ఏ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం ఏర్పడిందో అదే కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సాగిలపడటంపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. సొంత పార్టీలోని సీనియర్లు చంద్రబాబు తీరుపై అంతర్గతంగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆది నుంచి ఆయన వ్యవహార శైలిని గుర్తుచేస్తున్నారు. తన రాజకీయ మనుగడ కోసం టీడీపీ మూల సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ను మరోసారి హత్య చేశారని పార్టీ సీనియర్ నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు బరిలో దిగితే ఎన్టీఆర్ ఆయనపై మేడసాని వెంకట్రామనాయుడును పోటీ నిలిపారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి వెంకట్రామానాయుడు 17,429 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ ను ఎదురించడం సాధ్యం కాదని గ్రహించి తెరవెనుక రాజకీయాలు మొదలుపెట్టారు. 1983 ఎన్నికల అనంతరం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులతో ఒత్తిడి చేయించి టీడీపీలో చేరారు. ఆరోజుల్లో చంద్రబాబు చేరికను ఎన్టీఆర్ వ్యతిరేకించగా కుటుంబ సభ్యులు, కొందరు పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు బలవంతంగానే చంద్రబాబును పార్టీలో చేర్పించుకున్నారు.

అలా చేరిన తర్వాత ఎన్చీఆర్ పై అదే తరహా ఒత్తిడి తెచ్చి కర్షక పరిషత్ ను ఏర్పాటు చేయించి దాని బాధ్యతలు చేపట్టారు. అయితే కర్షక పరిషత్ ఏర్పాటును హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత కాలం నుంచి ఆయన టీడీపీలో తనకుంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వర్తిస్తూనే మామకు వ్యతిరేకంగా పార్టీలో చంద్రబాబు తన వర్గాన్ని పెంచుకున్నారు. అప్పట్లో కొందరు నేతలు సాహసించి ఎన్టీఆర్ కు చెప్పడానికి ప్రయత్నించగా సొంత అల్లుడు అంతటి పనులు చేస్తారా? అని వారించారు. అయితే, ఈ విషయాన్ని తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. చంద్రబాబును పార్టీలో చేర్చుకుని ఆనాడు తప్పుచేశానని ఎన్టీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఒక పావుగా ఎన్టీఆర్
ఈ 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు లబ్దిపొందారే తప్ప ఏనాడూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించే ప్రయత్నం చేయలేదన్నది సర్వత్రా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎప్పుడూ ఒక పావుగా ఉపయోగించుకోవడం అనేక సందర్భాల్లో రుజువైంది. ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేస్తే ఆయనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిపదవి కాపాడుకున్నారు. ఎన్నికల అనంతరం కుటుంబపరంగా ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరి రాజ్యాంగేతర శక్తిగా మారారు. ఒత్తిడి చేసి చంద్రబాబు కర్షక పరిషత్ ఏర్పాటు చేయించుకోవడం ద్వారా ఎన్టీఆర్ కు మచ్చతెచ్చారు. ఆనాటి నుంచి అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులు అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలోనూ ఎన్టీఆర్ ను వాడుకున్నారు. 

ప్రజాస్వామ్యం కోసమే వెన్నుపోటు
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించామని గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం చంద్రబాబు అన్న మాట. ఆశ్రయమిచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి బలవంతంగా పదవి నుంచి దింపేసి 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇవే మాటలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే చేశామన్నారు. ఎన్టీఆర్ ను గద్దె దింపిన తర్వాత మొత్తం టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అవుతూనే టీడీఎల్పీ తదితర పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలను తొలగించేశారు. తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ కొద్ది కాలంలోనే మరణించగా, తిరిగి మళ్లీ ఎన్టీఆర్ నామకరణం ప్రారంభించారు. 1999 ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ నామస్మరణ చేశారు. అధికారంలోకి రాగానే మళ్లీ ఎన్టీఆర్ చిత్రపటాలను తొలగించారు. ఆయన పేరు ఎక్కడా వాడకుండా జాగ్రత్త పడ్డారు. మళ్లీ ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ నామస్మరణ చేయడం, పథకాలకు ఆయన పేరును పెట్టడం వంటివి... ఇలా అనేక దశల్లో ఎన్టీఆర్ ను, ఆయన పేరు ఒక పావుగా చంద్రబాబు ఉపయోగించుకున్నారు.

30 శాతం కాంగ్రెస్ రక్తం
ఎన్టీఆర్ ను గద్దె దింపి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకానొక దశలో చంద్రబాబు ఏకంగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్న విషయాన్ని కొందరు నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. తన రక్తంలో 30 శాతం కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని ప్రకటించుకున్నారు. అదే అసెంబ్లీ వేదికగా అనేకసార్లు కాంగ్రెస్ పార్టీని, సోనియా, రాహుల్ గాంధీలను విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియాగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత జగన్ పై కేసులు పెట్టినప్పుడు సీబీఐని విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. ఇప్పుడేమో మా రాష్ట్రంలో ఐటీ దాడులు చేయిస్తారా? సీబీఐతో దాడులు చేయిస్తారా? ఎటుపోతున్నాం... అంటూ ఆగ్రహోదగ్రులవుతున్నారు. 

కాంగ్రెస్ తో లాలూచీ
23 మే 2018 రోజున కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్ తో చంద్రబాబు బేటీ అయ్యారు. టీడీపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఒక వేదికను పంచుకోవడం అదే మొదటిసారి. అయితే అది తెరమీదకు కనిపించే తొలి కలయిక. కానీ తెరవెనుక తొలినుంచి కాంగ్రెస్ అగ్రనేతలతో చంద్రబాబు సంబంధాలను కొనసాగిస్తూనే వస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానంతో నిత్యం సంప్రదింపులు జరిపారన్న విమర్శలు ఉన్నాయి. 

కొసమెరుపు
తెరవెనుక రాజకీయాలు చేయడంలో దేశ రాజకీయాల్లోనే చంద్రబాబును మించిన వారు ఉండరని విమర్శకులు అంటుంటారు. సిద్ధాంత నిబద్ధత ఉన్న నాయకులైతే సూటిగా రాజకీయాలు చేయడం, మాటపైన నిలబడటం అలవాటు. చంద్రబాబుకు మొదటినుంచి అలాంటివేవీ లేవు. 2014 లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో అధికారం పంచుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున తెరపైన కొత్త అవతారం ఎత్తారని అందరూ చెప్పుకుంటున్నదే. తెర వెనుక ఆయన ఇప్పటికీ బీజేపీతో తన సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారనడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యుల నియామకమే ఉదాహరణ. టీటీడీ చరిత్రలో ఇలాంటి నియామకం జరగలేదు. మహారాష్ట్ర బీజేపీ అగ్రనేత, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భార్య టీటీడీ బోర్డు మెంబర్ గా చంద్రబాబు నియమించడంలోని ఆంతర్యం కూడా చంద్రబాబు తెరవెనుక రాజకీయంలో భాగమే.

Advertisement
Advertisement