అదే జరిగింది!

Chandrababu decisions are violating Election Commission terms - Sakshi

టీడీపీ నేతలకు ‘ఉపాధి’ బిల్లుల చెల్లింపులకే కేబినెట్‌ భేటీ

మంత్రివర్గ సమావేశం ముగిసిన మరుసటి రోజే రూ.490 కోట్లు విడుదల

మిగతావి బ్యాంకులనుంచి అప్పు తీసుకుని చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

ఎన్నికల సంఘం షరతులను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయాలు

ఎన్నికల ఫలితాలలోపే చక్కబెట్టేస్తున్న ప్రభుత్వ పెద్దలు

‘స్వాహానే అజెండా’.. ముందే చెప్పిన ‘సాక్షి’

రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిశాక రూ.1,920 కోట్ల బిల్లులు సిద్ధం

గ్రామాల్లో పనులు జరిగిన తీరుపై అనుమానాలు

మట్టి రోడ్డు ఉన్న చోటే కొత్తగా రహదారి నిర్మించినట్లు అధికార పార్టీ నేతల బిల్లులు

సాక్షి, అమరావతి: అత్యవసరంగా మంత్రివర్గ సమా వేశం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హడావుడి అంతా సొంత పార్టీ నేతలకు ఉపాధిహామీ బిల్లులు చెల్లించేం దుకేనని తేటతెల్లమైంది. ఎన్నికల ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్న తరు ణంలో పట్టుబట్టి మరీ కేబినెట్‌ నిర్వహించిన మరుసటి రోజే ఉపాధిహామీ పెండింగ్‌ బకాయిల కింద రూ. 490 కోట్లు విడుదల చేస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు టీడీపీ నేతలకు నామినేషన్‌ పద్ధతిలో భారీగా  పనులు మంజూరు చేసి వాటిని కనీసం పరిశీలన కూడా చేయకుండానే బిల్లులు చెల్లించడానికే మంత్రివర్గ సమావేశం పేరుతో చంద్రబాబు హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. ‘సాక్షి’ ఇదే విషయాన్ని ఈనెల 9వ తేదీనే పాఠకులకు తెలియజేసింది. పెండింగ్‌ బకాయిల పేరుతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 1,920 కోట్లు టీడీపీ నేతలకు పంచి పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ‘స్వాహానే అజెండా’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తేవడం విదితమే.

నేడు డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు
ఉపాధి హామీ పెండింగ్‌ బకాయిలు చెల్లించేందుకు రూ.490.20 కోట్లు విడుదల చేస్తూ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి  మంగళవారం జీవో నెంబరు 373 జారీ చేశారు. బుధవారమే ట్రెజరీలో పనులు పూర్తి చేసి గురువారం నాటికల్లా డబ్బు చెల్లింపు పూర్తి చేయాలని ఆదేశించడంతో గ్రామీణాభివృద్దిశాఖలోని ఉపాధి హామీ అధికారులు చకచకా పనులు చేస్తున్నారు.

మిగతా డబ్బులు బ్యాంకు నుంచి అప్పు తేవాలని సీఎం ఆదేశం
ఉపాధిహామీలో మెటీరియల్‌ పనుల కింద పరోక్షంగా కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్న పనులకు అయ్యే ఖర్చులో 75 శాతం నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. మే 8వ తేదీ నాటికి రూ. 1,920 కోట్లు పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కేంద్రం రూ. 367 కోట్లను ఏప్రిల్‌ 9 తేదీనే రాష్ట్రానికి విడుదల చేసింది. ఆ మొత్తానికి  రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపినా కేవలం రూ. 490 కోట్లే అవుతుండడంతో మిగిలిన దాదాపు రూ. 1,430 కోట్లను కూడా ఏదో ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చి బకాయిలు చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కేంద్రం నిధులు విడుదల చేశాక ఆ నిధులను తిరిగి బ్యాంకులకు చెల్లించవచ్చని  సీఎం చెప్పినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

సాక్షిలో ప్రచురితమైన ‘ఉపాధి’ బిల్లులపై కథనం 

ఈసీ షరతులకు విరుద్ధంగా సీఎం తీరు..
ఈనెల 14వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన చేసిన మంత్రివర్గ భేటీ అజెండాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. కరువు, ఫొని తుపాను సహాయ చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షకు అనుమతించాలని ఈసీకి నివేదించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నాలుగు అంశాలపై సమీక్షకు మాత్రమే అనుమతిస్తూ షరతులు కూడా విధించింది. మంత్రివర్గ భేటీలో కొత్త నిర్ణయాలు తీసుకోరాదని, రేట్లు మార్పులు చేయరాదని, బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు తీసుకోరాదని, మీడియాకు వివరాలు వెల్లడించరాదని స్పష్టంగా షరతులు విధించింది. వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని, తాము అనుమతించాకే వీటిని అమలు చేయాలని ఈసీ ఆదేశాల్లో స్పష్టం చేసింది. మంత్రివర్గ సమావేశం అజెండాలో కేవలం ఉపాధి హామీ పథకంలో పనుల కల్పనపై మాత్రమే సమీక్షించాలని ఉంది. అయితే అజెండాకు విరుద్ధంగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద పార్టీ నేతలకు బిల్లులను అప్పు చేసైనా చెల్లించాలని సీఎం ఆదేశించడం అంటే ఈసీ షరతులను ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

కోడ్‌లోనూ జోరుగా పనులు.. బిల్లులూ రెడీ
మంత్రి నారా లోకేష్‌ తన శాఖలో ఎన్నికల ముందు ఉపాధి హామీ పథకం కింద గత ఆగస్టు నుంచి గ్రామాల్లోని టీడీపీ నాయకులకు భారీ సంఖ్యలో పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. ఉపాధిహామీలో కాంట్రాక్టర్ల విధానమే ఉండకూడదు. గ్రామ పంచాయితీ పేరుతోనే పనులు జరగాలి. ప్రస్తుతం సర్పంచుల పాలన లేకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని  ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చిన టీడీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు దక్కించుకున్నారు. కేవలం కొత్త రోడ్ల నిర్మాణానికే నిధులు మంజూరు చేయాల్సి ఉండగా టీడీపీ నేతలు చాలా చోట్ల అప్పటికే ఉన్న మట్టి రోడ్లనే మళ్లీ కొత్తగా నిర్మించేందుకు అనుమతులు పొందారు. రూ.లక్షల్లో అంచనాలు రూపొందించి నామమాత్రపు పనులు చేసి అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులు సిద్ధం చేశారు. ఇప్పుడు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్న రూ.1,920 కోట్లలో గ్రామీణ రోడ్ల బిల్లులే సగం ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ మార్చిలో రూ. 244.12 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 232.26 కోట్లు, మే నెల 8వ తేదీ వరకు రూ. 72.33 కోట్ల మేరకు పనులు పూర్తి చేసినట్టు చూపిస్తూ బిల్లులు రెడీ చేశారు. మార్చి 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కేవలం వారం రోజులకే మరో రూ. 61 కోట్ల మేరకు పనులు చేసినట్టు టీడీపీ నేతలు బిల్లులు సిద్ధం చేయడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top